కాలిఫోర్నియాలో భారతీయ అమెరికన్ల భారీ ర్యాలీ !

ABN , First Publish Date - 2020-10-19T17:49:56+05:30 IST

అమెరికాలోని కాలిఫోర్నియాలో డెమొక్రటిక్ అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థులు జో బైడెన్, కమలా హ్యారిస్‌లకు మద్దతుగా భారతీయ అమెరికన్లు ఆదివారం 'గెట్ అవుట్ ద ఓట్'(జీఓటీవీ) పేరిట భారీ ర్యాలీ నిర్వహించారు.

కాలిఫోర్నియాలో భారతీయ అమెరికన్ల భారీ ర్యాలీ !

కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియాలో డెమొక్రటిక్ అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థులు జో బైడెన్, కమలా హ్యారిస్‌లకు మద్దతుగా భారతీయ అమెరికన్లు ఆదివారం 'గెట్ అవుట్ ద ఓట్'(జీఓటీవీ) పేరిట భారీ ర్యాలీ నిర్వహించారు.  ప్రముఖ భారతీయ అమెరికన్ వ్యవస్థాపక దంపతులు అజయ్, వినీత భూటోరియా ఆధ్యర్యంలో జరిగిన ఈ ర్యాలీలో వ్యాపార యజమానులు, ఉపాధ్యాయులు, వైద్యులు, వ్యవస్థాపకులు, ఎన్నికైన అధికారులు, సంఘ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు భారతీయ అమెరికన్ ప్రముఖులు మాట్లాడారు. 


భూటోరియా మాట్లాడుతూ... "ఇంతకుముందు ఎన్నడూ లేనివిధంగా ఈ అధ్యక్ష ఎన్నికలు ఎంతో కీలకం. ప్రస్తుతం దేశం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో సరియైన అభ్యర్థికి అధికారాన్ని ఇవ్వడం ఎంతో అవసరం. అది జరగాలంటే మన ఓటు సరియైన వ్యక్తికి వేసి గెలిపించుకోవాలి" అని అన్నారు. ప్రస్తుతం దేశంలో ప్రజారోగ్య సంక్షోభం, ఆర్థిక సంక్షోభం, రేసికల్ ఇన్ జస్టిస్, వాతావరణ మార్పు వంటి ప్రధాన సమస్యలు ఉన్నాయి. వీటి నుంచి బయటపడాలంటే విఫల అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వల్ల కాదు. అందుకే మనం అందరం బైడెన్, కమలాకు ఓటు వేయాలి. ప్రధానంగా హోరాహోరీ పోరు ఉంటే రాష్ట్రాల్లో తప్పకుండా భారతీయ అమెరికన్లు బైడెన్, కమలాకే ఓట్లు వేయాలని భూటోరియా కోరారు. 


సీనియర్ కమ్యూనిటీ లీడర్ మహేష్ నిహాలని కూడా ఇండియన్ అమెరికన్లు తప్పకుండా తమ ఓట్లు బైడెన్, కమలాకే వేయాలని అన్నారు. ఇద్దరు నాయకులు భారత్-యూఎస్ ద్వైపాక్షిక సంబంధానికి బలమైన ప్రతిపాదకులు అని తెలిపారు. 'అబ్‌కీ బార్ బైడెన్ సర్కార్' అని ఈ సందర్భంగా మహేష్ నినాదించారు. 


ఇక నవబంర్ 3న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం అధికార రిపబ్లికన్, ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థులు హోరాహోరీగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ప్రచార ర్యాలీలలో అధ్యక్ష అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, జై బైడెన్ ఒకరిపై మరొకరు విమర్శలు, ప్రతి విమర్శలతో రక్తి కట్టిస్తున్నారు. కాగా, ఈ ఎన్నికల్లో సుమారు 1.8 మిలియన్ల మంది భారతీయ అమెరికన్ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారని తెలుస్తోంది. దీంతో ఈసారి ఎన్నికల్లో భారతీయుల ఓట్లు ఇరు పార్టీల అభ్యర్థుల విజయ అవకాశాలను ప్రభావితం చేయనున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 


తరువాతి తరం ఇండియన్ అమెరికన్ల అమెరికన్ డ్రీమ్ నెరవేరాలంటే తప్పకుండా బైడెన్, కమలాకు ఓటు వేయాలని ప్రముఖ హోటళ్ల అధినేత అశోక్ భట్ అన్నారు. తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా కమలా ఎన్నికైతే చరిత్ర అవుతుందన్నారు. ఒక భారత సంతతి మహిళ దేశ రెండో అత్యున్నత పదవిలో కొనసాగడం అది మన అందరికీ ఎంతో గర్వకారణం అని భట్ తెలిపారు. కాగా, అధ్యక్ష ఎన్నికల్లో హోరాహోరీ పోరు నడిచే విస్కాన్సిన్, పెన్సిల్వేనియా, మిచిగాన్, ఫ్లోరిడా, నెవాడా రాష్ట్రాల్లో సుమారు 1.3 మిలియన్లకు పైగా భారతీయ అమెరికన్ ఓటర్లు ఉన్నట్లు సమాచారం. 

Updated Date - 2020-10-19T17:49:56+05:30 IST