కాలిఫోర్నియాలో భార‌త వ్య‌క్తిపై కేసు.. లాక్‌డౌన్ సాకుతో మ‌నోడు ఏం చేశాడంటే..

ABN , First Publish Date - 2020-05-09T22:44:36+05:30 IST

అమెరికాలోని కాలిఫోర్నియాలో భార‌త సంత‌తి గ్రొస‌రీ షాపు య‌జ‌మానిపై అధిక ధ‌ర‌ల‌కు నిత్యావ‌స‌ర స‌రుకుల‌ను విక్ర‌యించినందుకు కేసు న‌మోదైంది.

కాలిఫోర్నియాలో భార‌త వ్య‌క్తిపై కేసు.. లాక్‌డౌన్ సాకుతో మ‌నోడు ఏం చేశాడంటే..

వాషింగ్ట‌న్ డీసీ: అమెరికాలోని కాలిఫోర్నియాలో భార‌త సంత‌తి గ్రొస‌రీ షాపు య‌జ‌మానిపై అధిక ధ‌ర‌ల‌కు నిత్యావ‌స‌ర స‌రుకుల‌ను విక్ర‌యించినందుకు కేసు న‌మోదైంది. కొన్ని వ‌స్తువుల ధ‌ర‌ల‌ను ఏకంగా 200 శాతం అధికంగా విక్ర‌యిస్తున్న‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. క‌రోనా సంక్షోభం వ‌ల్ల లాక్‌డౌన్ అమ‌లు చేస్తుండ‌డంతో ప్ర‌జ‌లు పూర్తిగా ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. దీంతో చాలా మంది ఇంటి నుంచి నిత్యావ‌సరాల కోసం ఆర్ద‌ర్‌ చేస్తున్నారు. ఇదే అదునుగా భావించిన దుకాణం య‌జ‌మాని ధ‌ర‌ల‌ను 200 శాతం వ‌ర‌కు పెంచి క‌స్ట‌మ‌ర్ల‌కు విక్ర‌యించ‌డం మొద‌లెట్టాడు. లాక్‌డౌన్ వల్ల నిత్యావ‌స‌ర స‌రుకులు దొర‌క‌డం క‌ష్టంగా ఉంద‌నే సాకుతో క‌స్ట‌మ‌ర్ల‌కు కుచ్చుటోపీ పెడుతున్నాడు. దీంతో ఓ వినియోగ‌దారుడు ఈ విష‌య‌మై పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. త‌న‌కు ఇంటికి పంపించిన వ‌స్తువుల తాలుకూ బిల్లును కూడా ఫిర్యాదులో జ‌త చేశాడు. 


వినియోగ‌దారుడి ఫిర్యాదు మేర‌కు పోలీసులు... కాలిఫోర్నియాలోని ప్లీజంట‌న్‌లో అప్నా బ‌జార్ న‌డిపిస్తున్న రాజ్వీంద‌ర్ సింగ్‌పై ఎంఆర్‌పీ కంటే అధిక ధ‌ర‌ల‌కు విక్ర‌యించినందుకు కేసు న‌మోదు చేశారు. రాష్ట్రంలో మార్చి 4న ప్ర‌క‌టించిన ఎమ‌ర్జెన్సీ త‌ర్వాత నుంచి రాజ్వీంద‌ర్ ఇలా అధిక ధ‌ర‌ల‌కు నిత్యావ‌స‌రాల‌ను విక్ర‌యిస్తున్న‌ట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే, ఎమ‌ర్జెన్సీ స‌మ‌యంలో 10 శాతం అధిక ధ‌ర‌కు వ‌స్తువుల‌ను విక్ర‌యించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. కానీ రాజ్వీంద‌ర్ మాత్రం ఏకంగా 200 శాతం పెంచి నిత్యావ‌స‌రాల‌ను విక్ర‌యిస్తున్న‌ట్లు పోలీసులు తేల్చారు. గురువారం ఈ కేసు అల్మెడ కౌంటీ సుపీరియర్ కోర్టులో విచార‌ణ‌కు వ‌చ్చింది. విచార‌ణ‌లో రాజ్వీంద‌ర్ వ‌స్తువుల ధ‌ర‌ల‌ను 200 శాతం పెంచి విక్ర‌యిస్తున్న‌ట్లు తేలింద‌ని కాలిఫోర్నియా అటార్నీ జనరల్ జేవియర్ బెకెరా, అల్మెడ కౌంటీ జిల్లా అటార్నీ నాన్సీ ఓ మాల్లీ తెలిపారు. దీంతో అత‌నికి ఏడాది జైలు శిక్ష/రూ. 7,55,040 జ‌రిమానా లేదా రెండు విధించ‌వ‌చ్చ‌ని తెలిపారు. 

Updated Date - 2020-05-09T22:44:36+05:30 IST