'ట్రంప్ హఠావో.. అమెరికా బచావో' అంటున్న భారతీయ దంపతులు

ABN , First Publish Date - 2020-10-13T18:41:46+05:30 IST

అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది అక్కడి రాజకీయ వాతావరణం వెడేక్కుతోంది. ఇప్పటికే రెండు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు, కార్యకర్తలు, మద్దతుదారులు ముమ్మరంగా ప్రచార కార్యక్రమాలతో హోరెత్తిస్తున్నారు. ఇక ఈ ఎన్నికల్లో కీలకంగా భావిస్తున్న ప్రవాస భారతీయ ఓటర్లపై కూడా ఇరు పార్టీలు ప్రధానంగా దృష్టిసారిస్తున్నాయి.

'ట్రంప్ హఠావో.. అమెరికా బచావో' అంటున్న భారతీయ దంపతులు

వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది అక్కడి రాజకీయ వాతావరణం వెడేక్కుతోంది. ఇప్పటికే రెండు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు, కార్యకర్తలు, మద్దతుదారులు ముమ్మరంగా ప్రచార కార్యక్రమాలతో హోరెత్తిస్తున్నారు. ఇక ఈ ఎన్నికల్లో కీలకంగా భావిస్తున్న ప్రవాస భారతీయ ఓటర్లపై కూడా ఇరు పార్టీలు ప్రధానంగా దృష్టిసారిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ ఉపాధ్యక్షుడు జో బైడెన్ ఎన్నారైల కోసం ప్రత్యేకంగా ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు. 


ఇదిలాఉంటే... మొదటి నుంచి బైడెన్‌కు మద్దతుగా వివిధ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్న సిలికాన్ వ్యాలీకి చెందిన భారతీయ దంపతులు అజయ్, వినీత భుటోరియాలు తాజాగా డిజిటల్ గ్రాఫిక్ క్యాంపెయిన్‌కు శ్రీకారం చుట్టారు. అధ్యక్ష అభ్యర్థి బైడెన్, ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌కు మద్దతుగా హిందీతో పాటు సుమారు 14 భారతీయ భాషల్లో సోమవారం ఈ కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ఈ క్యాంపెయిన్‌కు 'ట్రంప్ హఠావో.. అమెరికా బచావో', 'బైడెన్ హారిస్ కో జీతావో, అమెరికా కో ఆగే బడావో' పేర్లు పెట్టారు. కాగా, భారతీయ అమెరికన్ ఓటర్లు కీలక భూమిక పోషించే.. అమెరికాలో హోరాహోరీ పోరు ఉండే రాష్ట్రాలపై ఈ క్యాంపెయిన్ ప్రధానంగా ఫోకస్ పెడుతుందని ఈ సందర్భంగా భూటోరియా దంపతులు వెల్లడించారు. 


ఇక హోరాహోరీ పోరు ఉండే రాష్ట్రాల జాబితాలో పెన్సిల్వేనియా, విస్కాన్సిన్, మిచిగాన్, మిన్నెసోటాలతో పాటు మూడు దక్షిణాది రాష్ట్రాలు ఫ్లోరిడా, జార్జియా, నార్త్ కరోలినా... అలాగే అరిజోనా ఉన్నాయి. ఈ రాష్ట్రాలు మొత్తం 127 ఎలక్ట్రోల్ ఓట్లను కలిగి ఉన్నట్లు దంపతులు తెలిపారు. ఈ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చివరి వరకు ఉత్కంఠను రేపడంతో పాటు అధ్యక్ష అభ్యర్థిని నిర్ణయించేవిగా ఉంటాయని.. అందుకే భారతీయ అమెరికన్ ఓట్లు ఈ రాష్ట్రాల్లో కీలకం కానున్నాయని భూటోరియా చెప్పారు. 2016లో పెన్సిల్వేనియా, విస్కాన్సిన్, మిచిగాన్ రాష్ట్రాల్లో ట్రంప్ అధిక్యతను ప్రదర్శించడంతోనే ఆయన అధ్యక్ష పదవికి మరింత చేరువయ్యారని దంపతులు గుర్తు చేశారు. సుమారు 1.3 మిలియన్ల ఇండో-అమెరికన్ల ఓట్లు బైడెన్‌కే పడాలనే ఉద్దేశంతో ఆయనకు మద్దతుగా అమెరికాలోని భారతీయులకు చేరువయ్యేలా భారతీయ భాషల్లోనే పలు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. కాగా, నవంబర్ 3న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.  

Updated Date - 2020-10-13T18:41:46+05:30 IST