అమెరికా సుప్రీంకోర్టు జడ్జి రేసులో భారత సంతతి న్యాయమూర్తి !

ABN , First Publish Date - 2020-09-20T16:29:05+05:30 IST

పాన్‌క్రియాటిక్ క్యాన్సర్ కారణంగా అమెరికా సుప్రీంకోర్టు జస్టిస్ రూత్‌ బాడర్‌ గిన్స్‌బర్గ్ శుక్రవారం మరణించిన సంగతి తెలిసిందే.

అమెరికా సుప్రీంకోర్టు జడ్జి రేసులో భారత సంతతి న్యాయమూర్తి !

వాషింగ్టన్ డీసీ: పాన్‌క్రియాటిక్ క్యాన్సర్ కారణంగా అమెరికా సుప్రీంకోర్టు జస్టిస్ రూత్‌ బాడర్‌ గిన్స్‌బర్గ్ శుక్రవారం మరణించిన సంగతి తెలిసిందే. అయితే, ఆమె స్థానం భర్తీ చేసే జడ్జిల జాబితాలో భారత సంతతి జడ్జి అముల్ థాపర్ ముందు వరుసలో ఉన్నారని తెలుస్తోంది. రూత్ స్థానంలో కొత్తవారిని నియమించే విషయమై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిశీలిస్తున్న జడ్జిల జాబితాలో థాపర్ టాప్ ఉన్నట్లు సమాచారం. ట్రంప్ శనివారం మాట్లాడుతూ రూత్ స్థానంలో కొత్తవారి ఎంపికలో ఎలాంటి ఆలస్యం జరగదని చెప్పారు. కానీ, ఆమె స్థానంలో ఎవర్ని, ఎప్పుడు నియమించబోతున్నారో మాత్రం స్పష్టం చేయలేదు. అయితే ట్రంప్ వద్ద ఇప్పటికే 20 మంది సమర్థవంతమైన జడ్జిల జాబితా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో థాపర్ టాప్‌లో ఉన్నారని స్థానిక మీడియా సమాచారం. కొంతకాలంగా ఈ జాబితాలో ఉన్నా థాపర్... 2018లో పదవీ విరమణ చేసిన జస్టిస్ స్టీఫెన్ కెన్నెడీ స్థానం భర్తీ సమయంలో కూడా ఆయన పేరు తెరపైకి వచ్చింది. కానీ, ఈ రేసులో థాపర్‌ను వెనక్కి నెట్టి బ్రెట్ కవనాగ్ ఎంపికయ్యారు. 


51 ఏళ్ల థాపర్ ప్రస్తుతం 6వ యూఎస్ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌లో న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. భారతదేశం నుంచి అమెరికాకు వలస వెళ్లిన రాజ్ థాపర్, వీణా భల్లా దంపతులకు థాపర్ డెట్రాయిట్‌లో జన్మించారు. బోస్టన్‌లో కళాశాల విద్యను అభ్యసించారు. అనంతరం బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో లా చదివారు.


ఒకవేళ థాపర్ సుప్రీంకోర్టు జడ్జిగా నియామకమైతే... ఈ పదవి చేపట్టనున్న రెండో భారత సంతతి జడ్జిగా రికార్డు సృష్టించనున్నారు. థాపర్ కంటే ముందు శ్రీ శ్రీనివాసన్ అనే భారత సంతతి జడ్జిని 2013లో అప్పటి అమెరికా అధ్యక్షడు బరాక్ ఒబామా డీసీ సర్క్యూట్ కోర్టు అప్పీల్స్‌కు న్యాయమూర్తిగా నియమించడం జరిగింది.  


Updated Date - 2020-09-20T16:29:05+05:30 IST