ఇటలీకి మన పరికరం.. తయారు చేసిన కేరళ స్టార్టప్
ABN , First Publish Date - 2020-04-08T14:02:48+05:30 IST
కొవిడ్ - 19 వల్ల అత్యధిక సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న ఇటలీలో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ఒక భారతీయ వ్యాపారవేత్త కృషి చేస్తున్నారు.

తిరువనంతపురం: కొవిడ్ - 19 వల్ల అత్యధిక సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న ఇటలీలో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ఒక భారతీయ వ్యాపారవేత్త కృషి చేస్తున్నారు. కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన ప్రశాంత్ వారియర్ తన స్టార్టప్ కంపెనీ సహాయంతో కరోనా వ్యాప్తిని ట్రాక్ చేసే డిజిటల్ పరికరాన్ని రూపొందించారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే ఈ పరికరం కొవిడ్-19 రోగుల్లో కరోనా వైరస్ వ్యాప్తిని ట్రాక్ చేస్తుంది. క్యూఎక్స్ఆర్ అని పిలిచే ఈ పరికరం కొవిడ్ వ్యాధి గ్రస్తుల ఛాతీ ఎక్స్‌రేను విశ్లేషించి, రోగి ఊపిరితిత్తులు ఏ మేరకు దెబ్బతిన్నాయో నిర్ధారిస్తుంది. ప్రకాష్ వారియర్‌కు చెందిన క్యూర్.ఏఐ అనే కంపెనీ దీన్ని రూపొందించింది. ఇటలీలోని శాన్ రఫేల్ ఆసుపత్రిలో ఈ పరికరాన్ని ఇప్పటికే ఉపయోగిస్తున్నారు.
మనదేశంలోని ముంబైతోపాటు అమెరికా, మెక్సికో, యూకేలోని కొన్ని ఆసుపత్రులు కూడా దీన్ని వాడుతు న్నాయి. ప్రకాష్ సొంత రాష్ట్రమైన కేరళ ప్రభుత్వం కూడా ఈ దిశగా చర్చలు జరుపుతుంది. ఛాతీ ఎక్స్‌రేను విశ్లేషించడంతోపాటు రోగిలో వ్యాధి తీవ్రతను కూడా ఈ పరికరం అంచనా వేస్తుంది. రేడియాలజిస్ట్ అవసరం లేకుండానే ఈ పని పూర్తవుతుంది. టీబీ వ్యాధి నిర్ధారణ కోసం ఈ స్టార్టప్ రూపొందించిన పరికరాన్ని ప్రపంచ వ్యాప్తంగా 15 దేశాలు ఉపయోగిస్తున్నాయి. మెషీన్ లెర్నింగ్ టెక్నాలజీ సహాయంతో ఎక్స్‌కే, ఎంఆర్ఐ, సీటీ స్కాన్లను ఈ పరికరం విశ్లేషించి వ్యాధి నిర్ధారణ చేస్తుంది. గతంలో కేరళ ప్రభుత్వం కూడా సీటీ స్కాన్ రిపోర్టుల విశ్లేషణకు ఈ కంపెనీ సహకారం తీసుకుంది.