అబుధాబి క్రౌన్ ప్రిన్స్‌కు ప్రధాని మోదీ ఫోన్ కాల్...
ABN , First Publish Date - 2020-03-27T15:26:43+05:30 IST
మహమ్మారి కరోనావైరస్ కట్టడికి అనుసరించాల్సిన వ్యూహాలపై జీసీసీ(గల్ఫ్ కోఆర్డినేషన్ కౌన్సిల్) దేశాలు గురువారం సౌదీ అరేబియా రాజు సల్మాన్ బిన్ అబ్దులాజీజ్ అల్ సౌద్ అధ్యక్షతన జీ-20 ఎక్స్‌ట్రార్డినరీ వర్చువల్ లీడర్స్ సమ్మిట్ నిర్వహించాయి.
అబుధాబి: మహమ్మారి కరోనావైరస్ కట్టడికి అనుసరించాల్సిన వ్యూహాలపై జీసీసీ(గల్ఫ్ కోఆర్డినేషన్ కౌన్సిల్) దేశాలు గురువారం సౌదీ అరేబియా రాజు సల్మాన్ బిన్ అబ్దులాజీజ్ అల్ సౌద్ అధ్యక్షతన జీ-20 ఎక్స్‌ట్రార్డినరీ వర్చువల్ లీడర్స్ సమ్మిట్ నిర్వహించాయి. ఈ భేటీలో అబుధాబి క్రౌన్ ప్రిన్స్, యూఏఈ సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కూడా పాల్గొన్నారు. కరోనా వ్యాప్తిని ఎదుర్కోవటానికి ప్రపంచ దేశాల ప్రయత్నాలను సమన్వయం చేయడం, ఉమ్మడి సహకారం, సంఘీభావం పెంచే మార్గాలు ఈ శిఖరాగ్ర సదస్సులో చర్చకు వచ్చాయని అబుధాబి క్రౌన్ ప్రిన్స్ తెలియజేశారు.
కాగా, ఈ సమావేశం ముగిసిన అనంతరం తనకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి ఫోన్ కాల్ వచ్చిందని మొహమ్మద్ బిన్ జాయెద్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, 'కొవిడ్-19' వ్యాప్తిని అరికట్టడానికి ప్రయత్నాలు, ప్రజారోగ్యం మరియు ఆర్థిక వ్యవస్థలపై దాని ప్రభావాన్ని పరిమితం చేయడం లాంటి విషయాలపై చర్చించినట్లు ఆయన తెలిపారు.
ఇక జీ-20 ఎక్స్‌ట్రార్డినరీ వర్చువల్ లీడర్స్ సదస్సులో జీ-20 సభ్యులు మరియు జోర్డాన్, స్పెయిన్, సింగపూర్, స్విట్జర్లాండ్‌లతో సహా ఆహ్వానించబడిన దేశాల నాయకులతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంక్, ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ కార్మిక సంస్థ, ఆర్థిక సహకారం మరియు అభివృద్ధి సంస్థ, ప్రపంచ వాణిజ్య సంస్థ, ఆహారం మరియు సంబంధిత అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.