మానవతా దృక్పథంతో.. క్లోరోక్విన్‌కు ఓకే!
ABN , First Publish Date - 2020-04-08T14:19:51+05:30 IST
మలేరియా నిర్మూలనకు వాడే హైడ్రాక్సీ క్లోరోక్విన్ (హెచ్‌సీక్యూ) ఎగుమతిపై ఉన్న నిషేధాన్ని భారత్ పాక్షికంగా సడలించింది.

అవసరమున్న అన్ని దేశాలకూ ఇస్తామని ప్రకటన
న్యూఢిల్లీ-వాషింగ్టన్: మలేరియా నిర్మూలనకు వాడే హైడ్రాక్సీ క్లోరోక్విన్ (హెచ్‌సీక్యూ) ఎగుమతిపై ఉన్న నిషేధాన్ని భారత్ పాక్షికంగా సడలించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ, ఫార్మాస్యూటికల్స్ డిపార్ట్మెంట్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎ్‌ఫటీ) మంగళవారం సంయుక్తంగా నిర్ణయం తీసుకున్నాయి. దేశీయ అవసరాలకు సరిపడా నిల్వలున్నాయా లేవా అన్నది సమీక్షించాక ఈ నిర్ణయం గైకొన్నట్లు కేంద్రం వెల్లడించింది. దీనితో పాటు పారాసిటమాల్, విటమిన్ బీ1, బీ12, బీ6 మొదలైన 26 రకాల ఔషధాల ఫార్మ్యులేషన్స్ ఎగుమతిపైనా నిషేధం సడలిస్త్తున్నట్లు డీజీఎఫ్టీ ప్రకటించింది.
టినిడజాల్, మెట్రోనిడజాల్, ఎసీక్లోవిర్, ప్రొజెస్టరాన్, క్లోరాంఫెనికాల్, ఆర్నిడజాల్ మొదలైన మందుల ఫార్ములేషన్స్‌ను ఇక ఎగుమతి చేయవచ్చని తెలిపింది. క్లిండామైసిన్, నియామైసిన్ మొదలైన కీలక యాంటీబయాటిక్స్ తయారీకి వీటిలో కొన్ని ఫార్ములేషన్స్ ఉపయోగిస్తారు. ఈ సడలింపు నిర్ణయం వెలువడ్డ వెంటనే అనేక గొడౌన్లనుంచీ టన్నుల కొద్దీ హెచ్‌సీక్యూ స్టాకులు రిలీజయ్యాయి. అయితే అమెరికా చేసిన ఓ హెచ్చరిక అనంతరం కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం దౌత్యపరమైన దుమారానికి దారితీసింది.
ముందు సొంత అవసరాలే.. తర్వాతే ఎగుమతి 20 దేశాల నుంచి ఆర్డర్లు ఉన్నాయి: భారత్ మరో 24 ఔషధాలపైనా నిషేధం ఎత్తివేత సరఫరా చేయకపోతే ప్రతీకారం తప్పదు అంతకుముందు భారత్‌కు ట్రంప్ హెచ్చరిక దేశీయ అవసరాలు మొదట చూడాలి: రాహుల్
జరిగిందేమిటి?
కొవిడ్-19 నివారణకు హెచ్‌సీక్యూ దివ్యౌషధమని, గేమ్-ఛేంజర్ అనీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతూ వస్తున్నారు. ప్రపంచంలో 70శాతం హెచ్‌సీక్యూ భారత్‌లోనే తయారవుతోంది. దీని ఎగుమతిపై మార్చి 3న డీజీఎ్‌ఫటీ నిషేధం పెట్టింది. ఏప్రిల్ 5న ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్ చేసి హెచ్‌సీక్యూ తమకు ఎగుమతి అయ్యేలా చూడాలని కోరారు. మోదీ అన్నీ పరిశీలించాక నిర్ణయించుకుంటామన్నారు. నిజానికి ట్రంప్ మీడియాతో మాట్లాడడానికి కొద్ది గంటలముందే భారత్- హెచ్‌సీక్యూ, పారాసిటమాల్ ఎగుమతులపై నిషేధాన్ని పాక్షికంగా సడలించాలన్న నిర్ణయానికి సూత్రప్రాయంగా వచ్చింది. ఆ మేరకు మంగళవారం లాంఛనంగా ఆమోదముద్ర వేయాలని భావించింది. ఈలోపే ట్రంప్ మీడియా ముందుకొచ్చి ప్రతీకారం తప్పదన్న వ్యాఖ్య చేసేశారు. అయితే ఆయన వ్యాఖ్యను భారత్ తేలిగ్గా తీసుకుంది.
20 దేశాల నుంచి ఆర్డర్లు: భారత్
హెచ్‌సీక్యూ సరఫరాను దేశాలు, అవసరాలకు అనుగుణంగా సరఫరా చేస్తామని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ‘శ్రీలంక, నేపాల్ సహా దాదాపు 20 దేశాల నుంచి హెచ్‌సీక్యూ కోసం ఆర్డర్లున్నాయి. తీవ్రంగా దెబ్బతిన్న దేశాలకు దీనిని ప్రాధాన్యక్రమంలో ఎగుమతి చేస్తాం’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ చెప్పారు. ‘దేశంలో సరిపడా హెచ్‌సీక్యూ నిల్వలున్నాయా లేవా అన్నది సమీక్షించాకే ఈ ఎగుమతి సడలింపు నిర్ణయం తీసుకున్నాం. ప్రపంచదేశాలన్నీ కలిసికట్టుగా సహకరించుకోవాలనే మేం చెబుతున్నాం’ అని పేర్కొన్నారు. ముందు జాగ్రత్త చర్యగా కోటి హెచ్‌సీక్యూ ట్యాబ్లెట్లకు ఆర్డర్ పెట్టినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోవైపు.. ట్రంప్ హెచ్చరికను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ తప్పుబట్టారు. స్నేహంలో ప్రతీకారానికి తావులేదని, భారత్‌కి సరిపడా ఉంటేనే ఎగుమతులు చేయాలని సూచించారు.
నెలకు 40 టన్నుల హెచ్‌సీక్యూ ఉత్పత్తి!
భారత్‌లో నెలకు సగటున 40 టన్నుల హెచ్‌సీక్యూ ఉత్పత్తి జరపగల సామర్థ్యముందని భారత ఔషధ సమాఖ్య సెక్రటరీ జనరల్ సుదర్శన్ జైన్ చెప్పారు. 40 టన్నులంటే దాదాపు 20 కోట్ల 200 ఎమ్జీ టాబ్లెట్లు. మలేరియాకే కాక రుమటాయిడ్ ఆర్థరైటిస్, లూపస్ మొదలైన ఆటో ఇమ్యూన్ వ్యాధులకూ ఇది పనిచేస్తుంది కాబట్టి హెచ్‌సీక్యూకి ఎంతో డిమాండ్ ఉంది
ప్రతీకారమే..!
హెచ్‌సీక్యూ ఎగుమతికి సహకరించకపోతే- భారత్‌పై ప్రతీకారం తప్పదని ట్రంప్ సోమవారం రాత్రి హెచ్చరించారు.‘‘సరఫరా చేయరాదన్న నిర్ణయం వారు తీసుకున్నట్లు నాకు సమాచారం లేదు. నేను మాట్లాడినప్పుడు సంభాషణ సుహృద్భావ రీతిలో నడిచింది. హెచ్‌సీక్యూ ఎగుమతికి సహకరించాలని నేను కోరాను. భారత్ మా నుంచి ఏళ్లతరబడి ఎంతో సాయం పొందింది. అందుచేత అడిగాను. సరఫరా చేయరాదన్న నిర్ణయాన్ని వారు తీసుకుంటే ఆశ్చర్యమే. అది వారి ఇష్టం... అయితే తప్పనిసరిగా దానికి ప్రతీకారం ఉంటుంది’’ అని మీడియాతో అన్నారు.