అమెరికాలో హైదరాబాద్‌ టెకీ హఠాన్మరణం !

ABN , First Publish Date - 2020-12-03T20:01:41+05:30 IST

ఆమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్న హైదరాబాద్‌ మేడిపల్లిలోని శ్రీరామా ఆర్టీసీ కాలనీవాసి పానుగంటి శ్రీధర్‌(38) నవంబరు 26న రాత్రి నిద్రిస్తున్న సమయంలో గుండెపోటుతో మృతి చెందారు.

అమెరికాలో హైదరాబాద్‌ టెకీ హఠాన్మరణం !

గుండెపోటుతో ప్రాణాలు విడిచిన పానుగంటి శ్రీధర్‌

ఎర్రబెల్లి, మాలోతు కవితను కలిసిన కుటుంబ సభ్యులు

మృతదేహాన్ని తీసుకువచ్చేలా చేయాలని విజ్ఞప్తి

తొర్రూరు/పీర్జాదిగూడ, డిసెంబరు 2: ఆమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్న హైదరాబాద్‌ మేడిపల్లిలోని శ్రీరామా ఆర్టీసీ కాలనీవాసి పానుగంటి శ్రీధర్‌(38) నవంబరు 26న రాత్రి నిద్రిస్తున్న సమయంలో గుండెపోటుతో మృతి చెందారు. శ్రీధర్‌ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉద్యోగ నిమిత్తం భార్య ఝాన్సీ, కుమారుడు స్రాజన్‌(5)తో కలిసి ఆయన న్యూయార్క్‌లోని బఫేలో సిటీలో ఉంటున్నారు. గత ఐదేళ్లుగా అక్కడే ఎంఅండ్‌టీ బ్యాంకులో సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌గా పనిచేశారు.


లాక్‌డౌన్‌కు ముందు ఝాన్సీ తన తమ్ముడి వివాహం కోసం కుమారుడు స్రాజన్‌ను తీసుకుని భారత్‌కు వచ్చింది. శ్రీధర్‌ అమెరికాలోనే ఉండిపోయారు. ప్రతి రోజు ఉదయం భార్య ఝాన్సీ ఫోన్‌కాల్‌తోనే నిద్రలేచే శ్రీధర్‌ నవంబరు 27న ఉదయం ఆమె చేసిన ఫోన్‌ కాల్‌కు స్పందించకపోవడంతో ఆందోళన చెందారు. శ్రీధర్‌ ఉంటున్న అపార్ట్‌మెంట్‌ బాధ్యులకు ఆమె సమాచారమిచ్చారు. దీంతో వారు మరో తాళంతో గది తలుపు తీసి చూడగా శ్రీధర్‌ మంచంపై సృహలేకుండా కనిపించారు. వెంటనే అమెరికా ఎమర్జెన్సీ నంబర్‌ 911కు అపార్ట్‌మెంట్‌ బాధ్యులు ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చారు. అక్కడికి వచ్చిన ఎమర్జెన్సీ సిబ్బంది శ్రీధర్‌ నిద్రలోనే గుండెపోటుతో మృతి చెందాడని భావిస్తున్నారు.


రీపోస్టుమార్టం చేయించి రిపోర్టు తీసుకున్నాకే అక్కడి నుంచి భారత్‌కు తరలించడానికి వీలవుతుందని పోలీసులు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో రీపోస్టుమార్టం చేయాలంటే చాలా రోజులు పట్టవచ్చని అక్కడి పోలీసులు చెప్పడంతో మృతుడి కుటుంబీకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. శ్రీధర్‌ మృతదేహాన్ని భారత్‌కు తీసుకువచ్చేందుకు సహకరించాలని కోరుతూ రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మహబూబాబాద్‌ ఎంపీ మాలోతు కవితను శ్రీధర్‌ కుటుంబ సభ్యులు కలిశారు. మృతదేహం తీసుకువచ్చేందుకు సిఫారసు లేఖలు తీసుకుని టీఎంఓ ఆఫీ్‌సకు, ఇండియన్‌ ఎంబసీ అధికారులను కలిసి ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు సహాయం చేయాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు కూడా తాము ట్వీట్‌ చేసినట్లు శ్రీధర్‌ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. 

Updated Date - 2020-12-03T20:01:41+05:30 IST