అమెరికాలో హైదరాబాదీపై కాల్పులు !
ABN , First Publish Date - 2020-12-19T15:32:36+05:30 IST
అమెరికాలోని చికాగోలో హైదరాబాదీపై కాల్పుల ఘటన కలకలం రేపింది.

వాషింగ్టన్: అమెరికాలోని చికాగోలో హైదరాబాదీపై కాల్పుల ఘటన కలకలం రేపింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన వివరాల్లోకి వెళ్తే.. పాతబస్తీలోని చంచల్‌గూడకు చెందిన సయ్యద్ సిరాజ్ మెహదీ(30)పై డిసెంబర్ 4న కొందరు గుర్తుతెలియని దుండుగులు కాల్పులకు తెగబడ్డారు. 4వ తేదీ తెల్లవారుజామున ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. డెవాన్ ప్రాంతంలో సిరాజ్ కారుపై గుర్తు తెలియని వ్యక్తులు ఉన్నట్టుండి కాల్పులకు తెగబడ్డారు. నాలుగుసార్లు కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు.
దీంతో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. అదృష్టవశాత్తు సిరాజ్ క్షేమంగా బయటపడ్డాడు. కాగా, దుండగులు ఆటోమేటిక్ గన్స్ ఉపయోగించనట్లు తెలుస్తోంది. ఈ ఘటన నుంచి తమ కుమారుడు క్షేమంగా బయటపడటం పట్ల సిరాజ్ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. సిరాజ్ కుటుంబ సభ్యులు కాల్పుల విషయాన్ని భారత విదేశాంగ మంత్రి, అమెరికాలోని భారత రాయబారి, చికాగోలోని ఇండియన్ కాన్సులేట్ జనరల్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు.
