అపోహలకు చెక్ పెట్టేందుకు.. కరోనా కామిక్స్ గీసిన సింగపూర్ యువతి

ABN , First Publish Date - 2020-03-18T14:25:48+05:30 IST

కరోనా వైరస్‌ గురించి అవగాహన కన్నా అపోహలే ఎక్కువగా ప్రబలుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో అంతులేకుండా పుట్టుకొస్తున్న వదంతులు, నిరాధార వార్తల ప్రభావ ఫలితమే ఇదంతా! అలాంటప్పుడు వాటికి చెక్‌ పెట్టకపోతే జరిగే అనర్ధానికి అంతుండదని గ్రహించింది వేమెన్‌ కౌ అనే ఓ సింగపూర్‌ అమ్మాయి. తనకు పట్టు ఉన్న ఇలస్ట్రేషన్‌ కళ ద్వారా అపోహలను..

అపోహలకు చెక్ పెట్టేందుకు.. కరోనా కామిక్స్ గీసిన సింగపూర్ యువతి

కరోనా వైరస్‌ గురించి అవగాహన కన్నా అపోహలే ఎక్కువగా ప్రబలుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో అంతులేకుండా పుట్టుకొస్తున్న వదంతులు, నిరాధార వార్తల ప్రభావ ఫలితమే ఇదంతా! అలాంటప్పుడు వాటికి చెక్‌ పెట్టకపోతే జరిగే అనర్ధానికి అంతుండదని గ్రహించింది వేమెన్‌ కౌ అనే ఓ సింగపూర్‌ అమ్మాయి. తనకు పట్టు ఉన్న ఇలస్ట్రేషన్‌ కళ ద్వారా ఆ అపోహలను పారదోలే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు ఆమె గీసిన కరోనా కామిక్స్‌ను, ప్రపంచ దేశాలన్నీ ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఉపయోగించుకోవడం విశేషం.


వాట్సాప్‌లో కరోనాకు సంబంధించిన పలు మెసేజ్‌లు, వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లు కూడా కరోనా గురించిన వార్తలు, మీమ్స్‌తో నిండిపోతున్నాయి. ‘ఎన్‌95 మాస్క్‌ కొన్నావా, లేదా?’ అని స్నేహితులు మెసేజ్‌లు పెడుతూ ఉన్నారు. ఆఫీసులో సహోద్యోగులు.... ‘ఫలానా సబ్బు వాడు, కరోనా ఖతం అవుతుంది’ అని సలహాలిస్తున్నారు. ఇలాంటి వాతావరణంలో దేన్ని నమ్మాలో, దేన్ని నమ్మకూడదో, ఏం చేయాలో, ఏం చేయకూడదో అర్థం కాని అయోమయానికి లోనవడం సహజం. ఇలాంటి సమయంలో సింగపూర్‌కు చెందిన వేమెన్‌ కౌ గీసిన ఓ ఇలస్ట్రేషన్‌ వైరల్‌గా మారింది. సింగపూర్‌లో తొలి కరోనా కేసు నమోదు కావడంతో, బాధ్యత కలిగిన పౌరురాలిగా వేమెన్‌ తన టాలెంట్‌కు పదును పెట్టి, ఒక కరోనా ఇలస్ట్రేషన్‌ గీసింది. చిట్టి పొట్టి బొమ్మలతో ‘కరోనా వ్యాప్తి చెందే తీరును ఇలా అర్థం చేసుకోండి’ అంటూ ఆమె గీసిన ఆ ఇలస్ట్రేషన్‌ కొద్ది రోజుల్లోనే ప్రపంచదేశాలన్నిటినీ ఆకర్షించింది. వేమెన్‌ కౌ తన కామిక్‌ ద్వారా సూటిగా, సులువుగా, స్పష్టంగా కరోనా వ్యాప్తి, దాన్ని అరికట్టే తీరు గురించి వివరించడంతో ఇప్పుడు పలు దేశాలు ఆమె కామిక్‌నే కరోనా నివారణ ప్రచారం కోసం వాడుకుంటున్నాయి. 


ఆలోచన వచ్చిందిలా...

ఈ కామిక్‌ గురించి వేమెన్‌ కౌను ప్రశ్నిస్తే.... ‘‘జనవరిలో నేను శ్వాసకోస సమస్య నుంచి కోలుకుంటున్న సమయంలో, ఉహాన్‌లో కొత్త వైరస్‌ గురించిన వార్తలు వెలువడ్డాయి. అయితే దాని గురించి మరింత లోతుగా తెలుసుకోవడం కోసం నేను ఇంటర్నెట్‌లో వెతికే ప్రయత్నం చేస్తే, పలు రకాల సమాచారం కనిపించింది. ఆ వివరాలన్నీ అర్థం చేసుకోవడానికి క్లిష్టంగానూ తోచాయి. దాంతో ఓ ఇలస్ట్రేటర్‌ ఆర్టిస్ట్‌గా ఆ క్లిష్ట సమాచారాన్ని సరళమైన తీరులో కామిక్‌ ఫార్మాట్‌లోకి మారిస్తే అందరూ తేలికగా అర్ధం చేసుకుంటా రనిపించింది. దాంతో నమ్మదగిన వైద్య సమాచారాన్ని సేకరించి, సరళీకరించి, కామిక్స్‌ రూపంలోకి మార్చాను’’ అని చెప్పుకొచ్చింది. ఇప్పుడు వేమెన్‌ తయారుచేసిన కరోనా కామిక్‌ పలు ప్రకటనల్లో, పత్రికల్లో దర్శనమిస్తోంది. ఈ అమ్మాయి కామిక్‌కు వచ్చిన ఆదరణ చూసి, తమ భాషల్లోకి అనువదించి పంపించమని ఇండోనేషియా, కొరియా, వియత్నాం, పోర్చుగల్‌, భారతదేశం వేమెన్‌ను విజ్ఞప్తి చేస్తున్నాయి. దాంతో వాలంటీర్ల సహాయంతో తన కామిక్‌ను విదేశీ భాషల్లోకి అనువదించి పంపించింది వేమెన్‌.   


సోషల్‌ మీడియా తీరే వేరు!

 సోషల్‌మీడియా విసృత్తంగా వాడుకలో ఉన్న నేటి రోజుల్లో ఫోన్లలోకి వచ్చిపడే సమాచారాల పట్ల కొంత అప్రమత్తంగా ఉండడం అవసరం. ఇదే విషయాన్ని వేమెన్‌ ప్రస్తావిస్తూ... ‘‘సామాజిక మాఽధ్యమాలు తప్పుడు సమాచారంతో నిండి ఉంటున్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి గురించిన ఇలాంటి తప్పుడు సమాచారంతో ప్రజల్లో భయాందోళనలు కలగడం సహజం. ఒక్కోసారి నేను సైతం సోషల్‌మీడియాలో వెల్లువెత్తే తప్పుడు సమాచారాన్ని నిర్ధారించుకోవడం కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ వెబ్‌సైట్‌ను ఆశ్రయిస్తూ ఉంటాను’ అంటోంది. పిల్లలకు కరోనా గురించి అవగాహన కల్పించడం కోసం ‘ఇంటర్నేషనల్‌ కిడ్స్‌ డ్రా కోవిడ్‌ - 19 ఫ్యాక్ట్స్‌ ఛాలెంజ్‌’ అనే చిత్రలేఖన పోటీని నిర్వహిస్తోంది. అలాగే గందరగోళానికి లోను చేసే వెబ్‌సెట్లు, సోషల్‌మీడియాకు బదులుగా నమ్మదగిన, అధికారిక సమాచారాన్ని మాత్రమే వెతికేలా ప్రజలను ప్రోత్సహించడం కోసం ‘కామిక్స్‌ ఫర్‌ గుడ్‌’ అనే ప్రచారాన్ని కూడా చేపట్టబోతోంది వేమెన్‌. స్వచ్ఛంద వాలంటీర్ల సహాయంతో భారతదేశంలో వేర్వేరు భాషలకు తగ్గట్టుగా ఉచితంగా పీడీఎఫ్‌ డౌన్‌లోడ్స్‌  చేసుకునే సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తెచ్చే పనిలో ఉందీ అమ్మాయి. అనువాదంలో సహాయపడాలి అనుకునేవారు... https://gumroad.com/ వెబ్‌సైట్‌లో లాగిన్‌ కావాలి.

Updated Date - 2020-03-18T14:25:48+05:30 IST