కరోనా సోకిన వారికి స్ట్రోక్ వచ్చే అవకాశం తక్కువే: రిపోర్ట్

ABN , First Publish Date - 2020-07-28T00:11:19+05:30 IST

కరోనా బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు

కరోనా సోకిన వారికి స్ట్రోక్ వచ్చే అవకాశం తక్కువే: రిపోర్ట్

వాషింగ్టన్: కరోనా బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు అనేక వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదని కొత్త అధ్యయనం చెబుతోంది. కరోనాతో చికిత్స పొందుతున్న పేషంట్లకు స్ట్రోక్ వచ్చే ప్రమాదం చాలా తక్కువగానే ఉన్నట్టు తమ అధ్యయనంలో తేలిందని అమెరికాకు చెందిన నిపుణులు చెబుతున్నారు. కరోనా బారిన పడక ముందే డయాబెటిస్, హైబీపీ తదితర సమస్యలతో బాధపడుతున్న వారికే స్ట్రోక్ ఎక్కువగా వస్తున్నట్టు అధ్యయనంలో తేలిందని యూనివర్శిటి ఆఫ్ పెన్సిల్‌వేనియాలోని అసోసియేట్ ప్రొఫెసర్ బ్రెట్ కుషియారా తెలిపారు. కాగా.. అమెరికాలోని వివిధ ఆసుపత్రులలో కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న 844 మంది పేషంట్ల డేటాను అనలైజ్ చేయగా.. 2.4 శాతం మందికి ఇస్కేమిక్ స్ట్రోక్ వచ్చినట్టు పరిశోధకులు గుర్తించారు. 


ఈ స్ట్రోక్ వల్ల మెదడులో రక్తం గడ్డ కడుతుంది. ఈ స్ట్రోక్ బారిన పడిన వారిలో 95 శాతం మందికి హైబీపీ ఉన్నట్టు, 60 శాతం మంది డయాబెటిస్‌తో బాధపడుతున్నట్టు అధ్యయనంలో తేలింది. కేవలం కరోనా వల్లే స్ట్రోక్ రావడం లేదన్న విషయాన్ని ఫిజీషియన్లు సైతం అర్థం చేసుకోవాలని బ్రెట్ కుషియారా చెబుతున్నారు. అయితే కొవిడ్-19కు, స్ట్రోక్‌‌కు మధ్య ఉన్న సంబంధంపై మరిన్ని అధ్యయనాలు చేయాల్సిన అవసరం ఉందని బ్రెట్ కుషియారా చెప్పారు. కాగా.. స్ట్రోక్‌లలో సహజంగా రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఇస్కేమిక్ స్ట్రోక్.. మరొకటి హెమరాజిక్ స్ట్రోక్. ఇస్కేమిక్ స్ట్రోక్‌‌ వల్ల మెదడులో రక్తం గడ్డ కడుతుంది. హెమరాజిక్ స్ట్రోక్‌లో మెదడులో బ్లీడింగ్ అయి బ్రెయిన్ సెల్స్ పూర్తిగా దెబ్బతింటాయి.

Updated Date - 2020-07-28T00:11:19+05:30 IST