హెచ్-1బీ వీసాదారుల్లో ఆందోళన.. భారతీయులకు కష్టకాలమే
ABN , First Publish Date - 2020-04-01T13:18:12+05:30 IST
అగ్రరాజ్యం అమెరికాను కరోనా వైరస్ కమ్మేస్తోంది. ఇది ఆ దేశ ఆర్థిక పరిస్థితిపై పెను ప్రభావం చూపనుంది. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో అమెరికాలో ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం కనిపిస్తోంది.

అమెరికాలో లక్ష ఉద్యోగాలు గల్లంతే
గడువును 60 నుంచి 180కి పెంచాలి
వీసాదార్ల విజ్ఞప్తి.. ట్రంప్ సర్కార్‌కు లేఖ
విదేశీ ఉద్యోగులపైనే ప్రభావం
ఆర్థిక మాంద్యం తప్పదంటున్న నిపుణులు
వాషింగ్టన్, మార్చి 31: అగ్రరాజ్యం అమెరికాను కరోనా వైరస్ కమ్మేస్తోంది. ఇది ఆ దేశ ఆర్థిక పరిస్థితిపై పెను ప్రభావం చూపనుంది. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో అమెరికాలో ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం కనిపిస్తోంది. పలు కంపెనీలు తమ నష్టాలను పూడ్చుకునేందుకు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునే అవకాశం ఉంది. అమెరికాలో ఆర్థికమాంద్యం తలెత్తితే లక్ష ఉద్యోగాలు పోవడం తథ్యమని నిపుణులు అంచ నా వేస్తున్నారు. దీని ప్రభావం విదేశీ ఉద్యోగులపై ముఖ్యంగా భారతీయులపై ఎక్కువగా ఉండవచ్చంటున్నారు. అమెరికాలో హెచ్1బీ వీసాపై సింహ భాగం భారతీయులే పనిచేస్తుండటమే దీనికి కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో హెచ్1బీ వీసాపై పనిచేస్తున్న వారు ఆందోళన చెందుతున్నారు.
ఒకవేళ తాము ఉద్యోగం కోల్పోయిన పక్షంలో అమెరికాలో ఉండేందుకు అనుమతించిన కాలపరిమితిని 60 రోజులనుంచి 180 రోజులకు పెంచాలని వారు కోరుతున్నారు. ఈ మేరకు హెచ్1బీ వీసాదారులు ట్రంప్ సర్కారుకు లేఖ రాసేందుకు సిద్ధమయ్యారు. దీనిపై ఇప్పటికే 20 వేలమంది సంతకాలు చేశారు. ఒక ఫిర్యాదుపై వైట్ హౌస్‌నుంచి స్పందన రావాలంటే ఆ పిటిషన్‌పై కనీసం లక్ష సంతకాలు సేకరించాల్సి ఉంటుంది. దీంతో మరో 80 వేల సంతకాలకోసం హెచ్1బీ వీసాదారులు ప్రయత్నిస్తున్నారు. అమెరికాలో ఉద్యోగం చేస్తూ గ్రీన్‌కార్డు కోసం ఎదురు చూసే భారతీయుల కల ఇప్పట్లో తీరేలా కనిపించడంలేదు. ఉద్యోగ ఆధారిత గ్రీన్‌కార్డ్ బ్యాక్‌లాగ్ సంఖ్య 2030 నాటికి రెట్టింపు అవుతుందని తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. దీనివల్ల భారతీయులైతే గ్రీన్ కార్డు కోసం దశాబ్దాలపాటు ఎదురుచూడక తప్పదని పేర్కొంది.
సాధారణ స్థితికి వచ్చేది ఎపుడు?
రానున్న 30 రోజులు ఎంతో కీలకమైనవని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా ప్రకటించారు. ప్రజలు భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఎలా చూసుకున్నా అమెరికా సాధారణ స్థితికి చేరుకోడానికి కనీసం రెండు నుంచి మూడు నెలలు పట్టేలా కనిపిస్తోంది. మరోవైపు.. అమెరికాలో తమ పిల్లలు ఎన్ని కష్టాలు పడుతున్నారో అని భారత్‌లోని తల్లిదండ్రులు కంటి మీద కునుకు లేకుండా బతుకుతున్నారు. పిల్లలకు ప్రతీ రోజూ ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు.