వీడియో: మాధురీ దీక్షిత్‌ పాట ఉండగా.. 'కరోనా'తో భయమేలా అంటున్న గ్రీక్ యువతి

ABN , First Publish Date - 2020-03-19T00:32:42+05:30 IST

కరోనా వైరస్(కొవిడ్‌-19) ప్రపంచ దేశాలను వణికిస్తోంది. రోజురోజుకూ తన ప్రభావాన్ని పెంచుకుంటూ పోతోంది.

వీడియో: మాధురీ దీక్షిత్‌ పాట ఉండగా.. 'కరోనా'తో భయమేలా అంటున్న గ్రీక్ యువతి

బెర్లిన్: కరోనా వైరస్(కొవిడ్‌-19) ప్రపంచ దేశాలను వణికిస్తోంది. రోజురోజుకూ తన ప్రభావాన్ని పెంచుకుంటూ పోతోంది. చైనాలోని వూహాన్‌ నుంచి ప్రబలిన ఈ మహమ్మారి దాదాపు 150కి పైగా దేశాల్లో తన ఉనికిని చాటుకుంది. ఇటు భారత్‌లోనూ కరోనా పాజిటివ్ కేసులు 150కి చేరాయి. ఇక 'కొవిడ్‌-19' విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచ దేశాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఎక్కడా ఈ వైరస్‌ తమకు సోకుతుందోనని వారు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. అయితే, ఈ ఒత్తిడి నుంచి బయటపడటానికి గ్రీక్‌ దేశానికి చెందిన ఓ యువతి చేసిన పని, దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ యువతి ఒత్తిడిని తగ్గించుకునేందుకు బాలీవుడ్‌ సీనియర్ నటి మాధురీ దీక్షిత్‌ పాటకు డ్యాన్స్‌ చేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది.


ఈ యువతి పేరు క్యాథరినా కొరోసిడో. ప్రస్తుతం జర్మనీలో నివసిస్తున్న క్యాథరినా... తన అభిమాన నటి మాధురీ దీక్షిత్‌ పాపులర్‌ సాంగ్‌ 'ఏక్‌.. దో.. తీన్‌..' పాటకు చిందులేసింది. క్యాథరినా ఆనందంగా డ్యాన్స్‌ చేస్తున్న వీడియోను ఆమె తోటి ఉద్యోగి బెలుట్చ్ అనే వ్యక్తి తన ట్విటర్‌లో బుధవారం షేర్‌ చేశాడు. దీంతో ఈ వీడియో గంటల వ్యవధిలోనే వైరల్‌గా మారింది. ఈ వీడియోకు ఇప్పటి వరకూ 90 వేల వ్యూస్‌, 5వేలకు పైగా లైక్స్ రాగా... 1400 మంది రిట్వీట్స్ చేశారు. ఈ వీడియోకు బెలుట్చ్... ‘ప్రపంచ దేశాల ప్రజలు కరోనా కారణంగా ఆందోళ చెందుతుంటే నా కోలిగ్‌ చూడండి ఏం చేస్తుందో. కరోనా ఒత్తిడి నుంచి బయటపడటానికి తనకు ఇష్టమైన బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్‌ పాటలు వింటూ డ్యాన్స్‌ చేస్తోంది’ అని రాసుకొచ్చాడు. ఈ  వీడియోకు మాధురీ కూడా స్పందించడం విశేషం. నెటిజన్లు కూడా ఈ వీడియోపై తమదైన శైలిలో స్పందిస్తున్నారు. 

Updated Date - 2020-03-19T00:32:42+05:30 IST