ఇండియాలో గూగుల్ రూ.75వేల‌ కో‌ట్ల‌ పెట్టుబడులు !

ABN , First Publish Date - 2020-07-14T14:06:36+05:30 IST

వచ్చే 5-7 ఏళ్లలో భారత మార్కెట్లో రూ.75,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ ప్రకటించారు. దేశంలో డిజిటల్‌ సాంకేతికత వినియోగాన్ని వేగవంతం చేసేందుకు ఈ నిధులను వెచ్చించనున్నట్లు ఆయన చెప్పారు.

ఇండియాలో గూగుల్ రూ.75వేల‌ కో‌ట్ల‌ పెట్టుబడులు !

వచ్చే 5-7 ఏళ్లపాటు ఇన్వె‌స్ట్‌మెంట్‌ 

కంపెనీ సీఈఓ పిచాయ్‌ ప్రకటన  

న్యూఢిల్లీ: వచ్చే 5-7 ఏళ్లలో భారత మార్కెట్లో రూ.75,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ ప్రకటించారు. దేశంలో డిజిటల్‌ సాంకేతికత వినియోగాన్ని వేగవంతం చేసేందుకు ఈ నిధులను వెచ్చించనున్నట్లు ఆయన చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అనంతరం ‘గూగుల్‌ ఫర్‌ ఇండియా’ వార్షిక సదస్సులో వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా పిచా య్‌ పెట్టుబడులపై ప్రకటన చేశారు. ‘గూగుల్‌ ఫర్‌ ఇండియా డిజిటైజేషన్‌ ఫండ్‌’ ద్వారా ఈ పెట్టుబడులను పెట్టనున్నట్లు ఆయన తెలిపారు. పిచాయ్‌ ఇంకా ఏమన్నారంటే.. 


భారత్‌ భవిష్యత్‌, దాని డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థపైన కంపెనీకి ఉన్న విశ్వాసానికి ఈ పెట్టుబడుల ప్రణాళికే ప్రతిబింబం 

కొత్త టెక్నాలజీలన్నీ తొలుత ఇండియాలోనే అందుబాటులోకి వస్తున్నాయి. దాంతో  దేశ ప్రజలు వీటి కోసం వేచిచూడాల్సిన అవసరం ఉండట్లేదు 

ప్రస్తుతం భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా సంక్షోభంతో ఎదురవుతున్న ఆరోగ్య, ఆర్థిక పరమైన సవాళ్లు ప్రజలను పని, జీవనంపై పునరాలోచింప చేస్తున్నాయి. సవాళ్ల సమయంలోనే సరికొత్త ఆవిష్కరణలు అందు బాటులోకి వస్తాయి

భవిష్యత్‌ ఆవిష్కరణలతో లబ్ధి పొందడంతో పాటు వాటికి భారత్‌ నాయకత్వం వహించేలా చూస్తాం. ఈ విషయంలో గూగుల్‌ కట్టుబడి ఉంటుంది

భారత్‌ డిజిటల్‌ ప్రయాణాన్ని పూర్తి చేసేందుకు ఇంకా చాలా దూరం పయనించాల్సి ఉంది

దేశంలోని వందల కోట్ల ప్రజలకు ఇంటర్నెట్‌ సేవల వినియోగాన్ని చౌకగా, ప్రయోజనకరంగా మార్చాల్సి ఉంది. కొత్తతరం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రేరేపించి, మద్దతిచ్చేందుకు  వాయిస్‌ ఇన్‌పుట్‌ సేవలను మెరుగుపర్చడంతోపాటు కంప్యూటింగ్‌ను అన్ని భారత భాషల్లో అందుబాటులోకి తేవాల్సి ఉంది

అత్యంత ఉత్సాహాన్నిచ్చే విజయగాధల్లో చిన్న వ్యాపారాల డిజిటైజేషన్‌ ఒకటి. ప్రస్తుతం గూగుల్‌ సెర్చ్‌, మ్యాప్స్‌, డ్రైవింగ్‌ కనెక్షన్స్‌లో 2.6 కోట్ల చిన్న, మధ్య తరహా వ్యాపారాల వివరాలు అందుబాటులో ఉన్నాయి. వీటి సేవలను ప్రతినెలా 15 కోట్ల మంది వినియోగించుకుంటున్నారు.ప్రస్తుతం దేశంలోని చిన్న వ్యాపారులు సైతం డిజిటల్‌ చెల్లింపులను స్వీకరిస్తున్నారు

భారత్‌ డిజిటల్‌ పయనం ప్రశంసనీయం. వంద కోట్ల మందిని ఆన్‌లైన్‌ వేదికపైకి తీసుకురావడంలో చాలా పురోగతి సాధించింది. చౌక స్మార్ట్‌ఫోన్లు, డేటా సేవలతో పాటు విస్తృత టెలికాం నెట్‌వర్క్‌ కొత్త అవకాశాలను కల్పించాయి

తొలుత భారత్‌ కోసం ఉత్పత్తులను అభివృద్ధి చేయడం గూగుల్‌కు బాగా దోహదపడింది. తద్వారా ప్రపంచంలో ఎవరైనా వినియోగించగలిగే ఉత్పత్తులను అభివృద్ధి చేయగలిగాం. 


పెట్టుబడులు  ఎలా..?

క్విటీ కొనుగోళ్లు

భాగస్వామ్యాలు

కార్యాచరణ ప్రణాళికలు 

మౌలిక వసతులు 

సాంకేతిక ఆవరణ వ్యవస్థ 


కరోనా కాలంలో డిజిటల్‌ దూకుడు

కరోనా సంక్షోభంతో డిజిటల్‌ సాధనాల వినియోగం మరింత పుంజుకుందని గూగుల్‌ సారథి అన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో దేశంలోని కుటుంబాలకు డిజిటల్‌ చెల్లింపులు వస్తు కొనుగోళ్లు, సేవల వినియోగాన్ని సులభతరం చేశాయన్నారు. ఆంక్షల సమయంలో వారికి ఇంటి వద్దకే సరుకుల డెలివరీ అమూల్యమైన విషయం. కానీ, డిజిటల్‌ చెల్లింపు సేవలతో మా బామ్మకు బేరమాడే అవకాశం లేకుండా పోయిందని నవ్వుతూ అన్నారు. 


ప్రసార భారతితో జట్టు 

గూగుల్‌ ప్రసార భారతితో జట్టు కట్టింది. చిన్న వ్యాపారాలు డిజిటల్‌ సాధనాలను ఎలా వినియోగించుకోవచ్చు..? ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాపార పరివర్తనానికి సంబంధించి దూరదర్శన్‌లో ఎడ్యుటైన్‌మెంట్‌ సిరీస్‌ను ప్రారంభించనుంది. 


సీబీఎ్‌సఈతో భాగస్వామ్యం 

ఈ ఏడాది చివరి నాటికి భారత్‌లోని 22,000 పాఠశాలల్లో పనిచేసే 10 లక్షలకు పైగా ఉపాధ్యాయులకు డిజిటల్‌ శిక్షణ ఇచ్చేందుకు సీబీఎ్‌సఈతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు గూగు ల్‌ ప్రకటించింది. జీ సూట్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌, గూగుల్‌ క్లాస్‌రూమ్‌, యూట్యూబ్‌ను ఉపయోగించుకొని క్లాస్‌రూమ్‌లో, ఆన్‌లైన్‌లో విద్యార్థులకు బోధించడంపై ఉపాధ్యాయులకు సంస్థ శిక్షణ ఇవ్వనుంది. 


కేఈఎ‌ఫ్‌కు  10 లక్షల డాలర్ల సాయం 

కైవల్య ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌ (కేఈఎ్‌ఫ)కు 10 లక్షల డాలర్లు (రూ.7.5 కోట్లు) అందించనున్నట్లు గూగుల్‌ ప్రకటించింది. అల్పాదాయ సామాజిక వర్గాలకు మద్దతుగా గ్లోబల్‌ డిస్టెన్స్‌ లెర్నింగ్‌ ఫండ్‌ ద్వారా ఈ నిధులు సమకూర్చనుంది. 


ఈ అంశాలపై దృష్టి 


డిజిటైజేషన్

భారత్‌లో డిజిటల్‌ సేవల వినియోగాన్ని పెంచడంతో పాటు చౌకగా పొందేలా చూడటం.  దేశంలోని ప్రతి ఒక్కరికీ సమాచారాన్ని వారి స్థానిక భాషల్లో అందుబాటులోకి తేవడం 


కొత్త ఉత్పత్తులు, సేవలు 

భారతీయుల అవసరాలకు తగ్గట్టుగా ఉండే కొత్త ఉత్పత్తులు, సేవలను అభివృద్ధి పరచడం


వ్యాపారాలకు సాధికారత 

దేశంలోని చిన్న వ్యాపారాల డిజిటల్‌ పరివర్తనానికి సాయపడటం. తద్వారా వాటికి సాధికారత కల్పించడం 


సమాజ శ్రేయస్సు కోసం అదునిక సాంకేతికత 

సామాజిక మేలు కోసం వైద్య, విద్య, వ్యవసాయం తదితర రంగాల్లో కృత్రిమ మేధ (ఏఐ) ఇతర టెక్నాలజీల వినియోగం 


మోదీతో పిచాయ్‌ భేటీ 

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సోమవారం సుందర్‌ పిచాయ్‌ భేటీ అయ్యారు. ఈ వర్చువల్‌ సమావేశంలో డేటా సెక్యూరిటీ, సమాచార గోప్యతపై వ్యక్తమవుతున్న ఆందోళనలు,  రైతుల జీవన పరివర్తనం కోసం సాంకేతికత వినియోగం, ఆన్‌లైన్‌ విద్య పరిధి విస్తరణతో పాటు పలు అంశాలపై ఇరువురు చర్చించారు. ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) ఈ విషయాన్ని ప్రకటించింది. కొవిడ్‌ సంక్షోభ నేపథ్యంలో కార్పొరేట్‌ రంగంలో ఉద్యోగుల పనిచేసే విధానంలో వస్తున్న మార్పులు సైతం ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చాయి. క్రీడలు తదితర రంగాలకు ఈ విశ్వ మహమ్మారితో ఎదురవుతున్న సవాళ్లపైనా చర్చించారు. ‘‘సుందర్‌ పిచాయ్‌తో చర్చ చాలా ఫలప్రదంగా జరిగింది. చాలా అంశాలపై చర్చించాం’’ అని ప్రధాని మోదీ ట్విటర్‌లో పేర్కొన్నారు. ఇందుకు పిచాయ్‌ స్పందించారు. ‘‘సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు. మీ డిజిటల్‌ ఇండియా లక్ష్యాలపై చాలా ఆశావహంగా ఉన్నాం. ఈ దిశగా కంపెనీ తన వంతు కృషి చేయనుంది’’ అని ట్విట్‌ చేశారు. 


Updated Date - 2020-07-14T14:06:36+05:30 IST