ప్రపంచవ్యాప్తంగా 90 లక్షలు దాటిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-06-23T04:10:17+05:30 IST

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. సోమవారంతో ప్రపంచవ్యాప్తంగా

ప్రపంచవ్యాప్తంగా 90 లక్షలు దాటిన కరోనా కేసులు

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. సోమవారంతో ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 90 లక్షలు దాటింది. రీయూటర్స్ లెక్కల ప్రకారం..ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 91,10,519 కేసులు నమోదు కాగా.. 4,71,771 మంది మృత్యువాతపడ్డారు. ప్రపంచదేశాలతో పోల్చితే బ్రెజిల్, భారత్‌లలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. మొట్టమొదటి కరోనా కేసు చైనాలో జనవరిలో నమోదైంది. ఆ తరువాత కరోనా కేసులు 45 లక్షలకు చేరుకోడానికి నాలుగు నెలల సమయం పడితే.. 45 లక్షల నుంచి 90 లక్షలకు కేవలం ఐదు వారాల్లోనే చేరిపోయాయి. దీనిబట్టి ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తం నమోదైన కేసుల్లో 25 శాతం కేసులు ఒక్క అమెరికాలోనే నమోదయ్యాయి. అమెరికాలో ఇప్పటివరకు 22 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత బ్రెజిల్‌లో అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఒక్క శుక్రవారం రోజే ప్రపంచవ్యాప్తంగా 1,76,000 కేసులు నమోదు కాగా.. అందులో 54 వేల కేసులు ఒక్క బ్రెజిల్ నుంచే నమోదు కావడం గమనార్హం. బ్రెజిల్‌లో పరిస్థితి ఈ విధంగా ఉన్నా అక్కడి ప్రభుత్వం కరోనాపై ఎటువంటి పోరాటం చేయలేదు. ఆశించిన స్థాయిలో ఇక్కడ కరోనా పరీక్షలు కూడా నిర్వహించడం లేదు. ఈ దేశంలో ఇప్పటివరకు ఆరోగ్యశాఖ మంత్రి కూడా లేరంటే ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో అర్థమవుతుంది. భారత్‌లో లాక్‌డౌన్ ఆంక్షలు ఎత్తివేయడంతో నిత్యం 10 నుంచి 15 వేలకు తగ్గకుండా కరోనా కేసులు నమోదవుతున్నాయి. 


ఇక అమెరికాలో దాదాపు లక్షా 20 వేల మంది కరోనా కారణంగా మరణించగా.. బ్రెజిల్‌లో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 50 వేలు దాటింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా పరీక్షలు అమెరికానే చేసిందని చెప్పాలి. అమెరికాలో ఇప్పటివరకు 2.5 కోట్ల పరీక్షలు నిర్వహించినట్టు ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. ఇక ఆస్ట్రేలియా, భారత్, చైనా, జర్మనీలలోనూ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. చైనా కరోనాను జయించిందని అనుకునే సమయంలో ఒక్కసారిగా సెకండ్ వేవ్ ప్రారంభమైంది. అనేక దేశాలు కరోనా వ్యాక్యిస్‌ ప్రయోగాలు చేస్తున్నప్పటికి.. విజయవంతమైన వ్యాక్సిన్ ఇప్పటివరకు బయటకు రాలేదు. అమెరికా, యూరప్ దేశాల నుంచే విజయవంతమైన వ్యాక్సిన్ బయటకు వచ్చే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు.  

Updated Date - 2020-06-23T04:10:17+05:30 IST