డిసెంబర్ వరకు పాక్షిక షట్‌డౌన్‌ను పొడిగించిన జర్మనీ

ABN , First Publish Date - 2020-11-27T07:14:00+05:30 IST

దేశంలో కరోనాను అదుపులోకి తీసుకొచ్చేందుకు డిసెంబర్ వరకు పాక్షిక షట్‌డౌన్‌ను పొడిగించేందుకు జర్మన్ చాన్స్‌లర్

డిసెంబర్ వరకు పాక్షిక షట్‌డౌన్‌ను పొడిగించిన జర్మనీ

బెర్లిన్: దేశంలో కరోనాను అదుపులోకి తీసుకొచ్చేందుకు డిసెంబర్ వరకు పాక్షిక షట్‌డౌన్‌ను పొడిగించేందుకు జర్మన్ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్, 16 రాష్ట్రాల గవర్నర్లు బుధవారం అంగీకరించారు. కరోనా మహమ్మారిని అదుపులోకి తీసుకొచ్చేందుకు జర్మనీ ప్రభుత్వం నవంబర్ రెండో తేదీన షట్‌డౌన్ కార్యక్రమాన్ని అమలులోకి తీసుకొచ్చింది. షట్‌డౌన్‌లో భాగంగా దేశంలోని రెస్టారెంట్లు, బార్స్, స్పోర్ట్స్‌కు సంబంధించిన కార్యక్రమాలపై నిషేధం ఉంటుంది. ప్రభుత్వం మళ్లీ అనుమతి ఇచ్చేంత వరకు వీటిని తెరవకూడదు. అయితే షట్‌డౌన్ నుంచి స్కూళ్లు, దుకాణాలు, హెయిర్ సెలూన్లను మాత్రం ప్రభుత్వం మినహాయించింది. మొదట ఈ పాక్షిక షట్‌డౌన్‌ను నాలుగు వారాల పాటు అమలు చేయాలని ప్రభుత్వం భావించింది. 


క్రిస్ట్‌మస్ మాసం ఉండటంతో షట్‌డౌన్‌ను పొడిగించడమే మంచి నిర్ణయమని ప్రభుత్వం భావించింది. ఈ ఆంక్షలు కనీసం డిసెంబర్ 20వ తేదీ వరకు అయినా అమల్లో ఉండనున్నట్టు ఏంజెలా మెర్కెల్ తెలిపారు. లక్ష జనాభా ఉన్న ప్రాంతంలో వారానికి 50లోపే కరోనా కేసులు నమోదవ్వాలన్నది తమ లక్ష్యమని ఆమె చెప్పారు. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు తాము ముందుకు వెళ్తున్నామన్నారు. కాగా.. జర్మనీలో గడిచిన 24 గంటల్లో 18,633 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా ఒకేరోజు 410 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. జర్మనీలో ఇప్పటివరకు మొత్తం 9,87,124 కరోనా కేసులు నమోదుకగా.. కరోనా బారిన పడి మొత్తం 15,425 మంది మృత్యువాతపడ్డారు. 

Updated Date - 2020-11-27T07:14:00+05:30 IST