జార్జియా రీకౌంటింగ్.. బైడెన్‌దే విజయం !

ABN , First Publish Date - 2020-12-08T20:19:17+05:30 IST

అమెరికాలోని జార్జియాలో జరిగిన రీకౌంటింగ్ ఫలితాన్ని అధికారులు సోమవారం ప్రకటించారు.

జార్జియా రీకౌంటింగ్.. బైడెన్‌దే విజయం !

జార్జియా: అమెరికాలోని జార్జియాలో జరిగిన రీకౌంటింగ్ ఫలితాన్ని అధికారులు సోమవారం ప్రకటించారు. ఈసారి కూడా డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్‌కే విజయం వరించినట్లు అధికారులు ధృవీకరించారు. దీంతో ఈ రాష్ట్రంలోని 16 ఎలక్టోరల్ ఓట్లు బైడెన్ ఖాతాలో చేరినట్లు అధికారులు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే... ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కోర్టు మెట్లెక్కిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జార్జియాలో ట్రంప్ రీకౌంటింగ్‌ జరపాలని పట్టుబట్టారు. దీనికి కారణం ఇక్కడ బైడెన్, ట్రంప్ మధ్య మెజారిటీలో స్వల్ప తేడా ఉండడం. జార్జియాలో మొదట జో బైడెన్ 12,670 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచారు. అంతేగాక జార్జియా చట్ట ప్రకారం ఇరువురు అభ్యర్థుల మధ్య మార్జిన్ 0.5 శాతం కంటే తక్కువ ఉంటే.. ఓడిన అభ్యర్థి రీకౌంటింగ్‌కు అభ్యర్థించే వెసులుబాటు కూడా ఉంది. 


దీంతో ట్రంప్ రీకౌంటింగ్‌కు వెళ్లారు. ఈసారి అధికారులు చాలా పకడ్బందీగా కౌంటింగ్ నిర్వహించారు. ఎలాంటి తప్పులు జరగకుండా స్కానర్లను వినియోగించినట్లు జార్జియా సెక్రెటరీ ఆఫ్ స్టేట్ బ్రాడ్ రాఫెన్స్‌పెర్గర్ తెలిపారు. అయితే, ఈసారి కూడా విజయం బైడెనే వరించింది. కాకపోతే ఆధిక్యం కొద్దిగా తగ్గింది. మొదటిసారి 12,670 ఓట్ల ఆధిక్యం రాగా... ఈసారి 766 ఓట్లు తగ్గి 11,779గా వచ్చింది. దీంతో అధికారులు జార్జియాలో మళ్లీ బైడెనే గెలిచినట్లు అధికారికంగా ధృవీకరించారు. ఈ మేరకు సోమవారం ధృవపత్రాలు కూడా విడుదల చేశారు.    


Updated Date - 2020-12-08T20:19:17+05:30 IST