రెండు లక్షల మంది విదేశీ కార్మికులపై జీసీసీ నిషేధం !

ABN , First Publish Date - 2020-10-07T13:22:05+05:30 IST

గతేడాది మెడికల్ ఫిట్‌నెస్ టెస్టులో విఫలమైన రెండు లక్షల మంది విదేశీ కార్మికులపై ఆరు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్(జీసీసీ) సభ్య దేశాలు నిషేధం విధించాయి.

రెండు లక్షల మంది విదేశీ కార్మికులపై జీసీసీ నిషేధం !

అబుధాబి: గతేడాది మెడికల్ ఫిట్‌నెస్ టెస్టులో విఫలమైన రెండు లక్షల మంది విదేశీ కార్మికులపై ఆరు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్(జీసీసీ) సభ్య దేశాలు నిషేధం విధించాయి. జీసీసీ హెల్త్ కౌన్సిల్ నివేదిక ప్రకారం వారు మెడికల్ ఫిట్‌నెస్ తనిఖీలలో విఫలమయ్యారని, అందుకే తమ దేశాల్లో వారిని ప్రవేశించకుండా బ్యాన్ విధించిన్నట్లు పేర్కొన్నాయి. గతేడాది జీసీసీ ప్రవాస కార్మిక స్క్రీనింగ్ కార్యక్రమం మొత్తం మూడు మిలియన్ల మందిని రిజిస్టర్ చేసింది. దీనికోసం కొత్తగా వచ్చిన ఎలక్ట్రానిక్ 'ఇంట్రా' అనే పద్దతిని ఉపయోగించింది. కాగా, 1995 నుంచి జీసీసీ దేశాలు ప్రవాస కార్మికులకు ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. 


అలాగే 2002 నుంచి ఏడు ఆసియా దేశాల నుండి జీసీసీ సభ్య దేశాల్లో రెసిడెన్సీ వీసాలు కావాలనుకునే విదేశీయులు తమ దేశాలలో అధీకృత ఏజెన్సీ ధృవీకరించిన మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సిందిగా కోరుతున్నాయి. దీనికోసం జీసీసీ మెడికల్ కమిటీ ఏడు దేశాలలో జీసీసీ అప్రూవ్డ్ మెడికల్ సెంటర్స్ అసోసియేషన్(గామ్కా)ను ఏర్పాటు చేసింది. భారతదేశం, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, పాకిస్తాన్ దేశాల నుంచి వెళ్లే ప్రవాసులు తప్పనిసరిగా ఈ మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌ సమర్పించాల్సి ఉంటుంది.


అందుకే ఈ దేశాల ప్రవాసులు జీసీసీ దేశాలకు ఉపాధి కోసం ప్రయాణించే ముందు, రెసిడెన్సీ వీసా, ఉన్నత చదువుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి గామ్కా వైద్య పరీక్ష తప్పనిసరి. కనుక ఆరు జీసీసీ దేశాలకు వెళ్లాలనుకునే ప్రవాసులు గామ్కా కేటాయించిన వైద్య కేంద్రాలలో మెడికల్ ఫిట్‌నెస్ టెస్టు చేయించుకోవాలి. ఈ టెస్టు అనంతరం గామ్కా కేంద్రం నుంచి పాజిటివ్ రిపోర్టు వస్తేనే మీ గమ్యస్థాన దేశానికి వెళ్లవచ్చు.


జీసీసీ దేశాలకు చేరుకున్న తర్వాత ప్రవాసులను తిరిగి మరోసారి మెడికల్ ఫిట్‌నెస్ టెస్టు నిర్వహిస్తారు. ఒకవేళ ఇక్కడ అన్‌ఫిట్‌గా తేలితే వారిని నిషేధిస్తారు. తాజా నివేధిక ప్రకారం 17 నుంచి 20 శాతం మంది ప్రవాస కార్మికులు తప్పుడు ఫిట్‌నెస్ సర్టిఫికేట్లతో జీసీసీ దేశాలకు వెళ్లి.. అక్కడ స్క్రీనింగ్ కార్యక్రమంలో ఫెయిల్ అవుతున్నట్లు తెలిసింది. 

Updated Date - 2020-10-07T13:22:05+05:30 IST