డ్రాగ‌న్ కంట్రీకి అది వెన్నతో పెట్టిన విద్య..!

ABN , First Publish Date - 2020-06-18T13:41:36+05:30 IST

శాంతి కోసమంటూ చర్చలు జరపడం.. ఒప్పందాలు కుదరగానే వాటిని దారుణంగా ఉల్లంఘించడం.. చైనాకు వెన్నతో పెట్టిన విద్య. 1950ల నుంచీ గాల్వన్‌ దుస్సాహసం వరకు ఇదే కుతంత్రం పాటిస్తోంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు సృష్టించేదీ తానే.. సంక్షోభ నివారణకు శాంతి చర్చలు జరుపుదాం అనేదీ తానే.

డ్రాగ‌న్ కంట్రీకి అది వెన్నతో పెట్టిన విద్య..!

మాటల మంత్రం.. దాడుల తంత్రం

చైనా రెండు నాల్కల ధోరణి

కుదుర్చుకున్న ఒప్పందాలు తుంగలోకి

గాల్వన్‌ దుస్సాహసం అందులో భాగమే!

శాంతి కోసమంటూ చర్చలు జరపడం.. ఒప్పందాలు కుదరగానే వాటిని దారుణంగా ఉల్లంఘించడం.. చైనాకు వెన్నతో పెట్టిన విద్య. 1950ల నుంచీ గాల్వన్‌ దుస్సాహసం వరకు ఇదే కుతంత్రం పాటిస్తోంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు సృష్టించేదీ తానే.. సంక్షోభ నివారణకు శాంతి చర్చలు జరుపుదాం అనేదీ తానే. సరిహద్దు సమస్య శాశ్వత పరిష్కారానికి జరిపే చర్చల్లో భారత్‌పై పైచేయి సాధించడానికి తన సైనిక సంపత్తిని చూపించి బెదిరించడానికి ఎల్‌ఏసీ వెంబడి ఘర్షణలను చైనా చాకచక్యం గా ఉపయోగించుకుంటోందని విదేశాంగ నిపుణులు చెబుతున్నారు. గాల్వన్‌ దుస్సాహసమే దీనికి తాజా ఉదాహరణగా పేర్కొంటున్నారు. ఈ నెల 6న ఉభయ మిలిట రీ కమాండర్లు ఓ ఒప్పందానికి వచ్చారు. గాల్వన్‌ లోయ నుంచి ఉభయపక్షాలు బలగాలను ఉపసంహరించాలని నిర్ణయించారు. అది జరిగి పట్టుమని 10 రోజులు కాకముందే ఆ ఒప్పందానికి చైనా తూట్లు పొడిచింది. నిజానికి గత ఏప్రిల్‌లోనే చైనా బలగాలు భారత భూభాగంలోకి చొరబడి స్థావరం ఏర్పాటు చేసుకున్నాయి. నిఘా సమాచారం అందినప్పటికీ భారత సైన్యం అడ్డుకోవడానికి ప్రయత్నించలేదు. కరోనా వైరస్‌ కూడా దీనికి కొంత కారణం. పైగా గాల్వన్‌ ఏరియా ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. ఇటీవలి కాలంలో ఘర్షణలు చోటుచేసుకోలేదు. దీంతో చైనా స్థావరాలతో ముప్పు లేదని భావించింది. అయితే చైనా బలగాల మోహరింపు గాల్వన్‌, పాంగాంగ్‌ సోలకే పరిమితం కాలేదు. కీలకమైన దెస్పాంగ్‌ లోయ, దౌలత్‌ బేగ్‌ ఓల్డీ ప్రాంతాల్లోనూ స్థావరాలను ఏర్పాటుచేసింది. ఎల్‌ఏసీ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి 2,000 కిలోమీటర్ల వరకు సైనిక బలగాలను రంగంలోకి దించినట్లు వార్తలు అందుతున్నాయి.


నెహ్రూ హయాంలోనూ..

ఎల్‌ఏసీ, సరిహద్దులపై భారత్‌ను మోసగించడం చైనాకు ఇదే మొదటిసారి కాదు. 1950ల్లో నెహ్రూ హయాంలోనూ ఇలాగే చేసింది.  కమ్యూనిస్టు సిద్ధాంతాలంటే నెహ్రూకు ఎంతో ఇష్టం. ఈ కారణంగానే సోవియ ట్‌ యూనియన్‌కు ఆయన చేరువయ్యారు. చైనాలో కొమింటాంగ్‌ పాలనను మావో జెడాంగ్‌ కూలదోయగా నే.. ఆయన ప్రభుత్వాన్ని తక్షణమే గుర్తించిన పాలకుడు నెహ్రూనే. ఆ తర్వాత 1954-55 నడుమ చైనాను ప్ర పంచ రాజకీయ యవనికపైకి తెచ్చింది కూడా ఆయనే. 1955లో ఆ దేశ ప్రధాని చౌ ఎన్‌లై, నెహ్రూ కలిసి పంచశీల ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. మరుసటి ఏడాది ఇద్దరూ భేటీ అయినప్పుడు ఇరు దేశాల మధ్య సరిహద్దు సమస్య పెద్దగా లేనే లేదన్నట్లుగా చౌఎన్‌లై వ్యాఖ్యానించారు. కానీ కొద్దిరోజులకే అక్సాయ్‌ చిన్‌ ప్రాంతం తమదేనని అనడం మొదలుపెట్టారు. అక్కడ ఏకంగా హైవే నిర్మాణమే చేపట్టారు. దీంతో నెహ్రూ బిత్తరపోయారు.


‘హిందీ-చీనీ భాయీ భాయీ’ అంటూనే సరిహద్దుల వద్ద కవ్వింపులకు దిగడం చూశాక చైనా ఆంతర్యం భారత పార్లమెంటేరియన్లకు అవగతమైంది. దీంతో సరిహద్దు సమస్యపై ప్రభుత్వం శ్వేతపత్రం ప్రకటించాల్సి వచ్చింది. చౌ ఎన్‌లౌ తరచూ తనకు అబద్ధాలు చెప్పారని.. ఇక ఆయన్ను ఎంత మాత్రం విశ్వసించలేనని నెహ్రూ వ్యా ఖ్యానించారు. అటు తర్వాత శాంతి ఒప్పందాలను ఉల్లంఘించి చైనా 1962లో దురాక్రమణకు పాల్పడింది. అంతేగాక అక్సాయ్‌చిన్‌లో అధిక ప్రాంతాన్ని ఆక్రమించింది. గాల్వన్‌ లోయ సరిహద్దును మార్చేసింది. తర్వాత బలగాలను వెనక్కి పిలిపించింది. ఈ దాడి ఎంత ఏకపక్షమో.. సైన్యం ఉపసంహరణ కూడా ఏకపక్షమే కావడం ఆశ్చర్యకరం. 2 దేశాలు కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకం చేయనేలేదు. ఎల్‌ఏసీని సరిహద్దు విభజన రేఖగా ఒప్పందం కుదుర్చుకోనూలేదు. 


93, 96 ఒప్పందాలకూ తిలోదకాలు..

1993లో పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు ఎల్‌ఏసీ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఎల్‌ఏసీ పొడవునా మోహరించిన బలగాలను ఉపసంహరించుకోవాలన్నది దాని సారాంశం. ఎవరైనా గీత దాటితే.. ఆవలి పక్షం సమాచారమివ్వగానే సైన్యం వెనక్కి వచ్చేయాలని కూడా ఒప్పందంలో పొందుపరిచారు. వీటిని చైనా పాటించలేదు. ఆ తర్వాత దేవెగౌడ ప్రధానిగా ఉన్నప్పు డు చేసుకున్న మరో ఒప్పందంలో పేర్కొన్న అంశాల్లోనూ   చైనా ఏ ఒక్కటీ పాటించలేదు. ఎల్‌ఏసీగా గుర్తించని ప్రాంతాల్లో ఓ దేశ గస్తీ బృందాన్ని మరో దేశ బృందం అటకాయించరాదంటూ 2013లో ఇరు దేశాల మధ్య మరో ఒప్పందం కుదిరింది. కానీ గాల్వన్‌, పాంగోంగ్‌ సో, దేస్పాంగ్‌ లోయల్లో భారత బృందాలతో తరచూ చైనా ఘర్షణలకు దిగుతూనే ఉంది. 


దాడిచేసి దారికి తెచ్చుకోవాలి!

అది మావో జెడాంగ్‌ మాట: కిసింజర్‌

చైనా వ్యవహార శైలిని అమెరికా విదేశాంగ మాజీ మంత్రి హెన్రీ కిసింజర్‌ అర్థం చేసుకున్నట్లు ఇంతవరకు ఎవరూ అర్థం చేసుకోలేదని విదేశాంగ నిపుణులు అంటుంటారు. 1962లో చైనా యుద్ధం సందర్భంగా జరిగిన పరిణామాలను ఆయన ఓ సందర్భంలో జ్ఞప్తికి తెచ్చుకున్నారు. ‘1962 అక్టోబరులో చైనా అధినేత మావో జెడాంగ్‌ తమ మిలిటరీ కమాండర్లు, కమ్యూనిస్టు నేతలతో సమావేశమయ్యారు. అప్పటికే భారత్‌పై దురాక్రమణ చేస్తున్నారు. ఆ సమయంలోనే దాడి నుంచి వెనుదిరగాలని నిర్ణయించుకున్నారు. అయితే వారినుద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కలిగిస్తాయి. రెండు దేశాలు శాశ్వత శత్రువులుగా మిగలకూడదు.


సుదీర్ఘకాలం శాంతియుతంగా కలిసి మెలిసి ఉండాలి. కానీ ఇలా చేయాలంటే.. భారత్‌ను చర్చలకు ఒప్పించాలంటే బలప్రయోగమే మార్గమని జెడాంగ్‌ చెప్పారు. దానికి అనుగుణంగానే భారత్‌పై ఆకస్మికంగా యుద్ధం ప్రకటించడం.. అంతే ఆకస్మికంగా బలగా ల ఉపసంహరించుకోవడం జరిగా యి’ అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు గాల్వన్‌లో చైనా దుస్సాహసం చూశాక పలువురు నిపుణులు కిసింజర్‌ వ్యాఖ్యలను గుర్తుచేసుకుంటున్నారు. చర్చల కోసమే ఇలా చేసిందని అనుకుంటే.. ఎందుకోసం చైనా ఇప్పుడు చర్చలను కోరుకుంటోందో వారికి అర్థం కావడం లేదు. అయితే ప్రధాని మోదీ క్రమంగా అమెరికాకు చేరువ అవుతుండడం.. రక్షణ సహకారం, అహ్మదాబాద్‌లో ‘నమస్తే ట్రంప్‌’ కార్యక్రమంలో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పాల్గొనడం, అక్సాయ్‌చిన్‌ను స్వాధీనం చేసుకుంటామని పార్లమెంటులో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రకటించడం వంటివాటిపై చైనా నాయకత్వం ఇప్పటికే భారత్‌కు వివిధ మార్గాల ద్వారా అసంతృప్తి తెలియజేసిందని నిపుణులు అంటున్నారు. భారత్‌తో అమెరికా సాన్నిహిత్యం పెంచుకోవడాన్ని అలక్ష్యం చేయజాలమని చైనా అధికార పత్రిక ‘ది గ్లోబల్‌ టైమ్స్‌’ ద్వారా వ్యాఖ్యానించింది. అలాగే ఈ ఏడాది మే నెలలో జిన్‌పింగ్‌ చైనా బలగాలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. యుద్ధానికి సన్నద్ధండా ఉండాలని పిలుపిచ్చారు. ఇది భారత్‌ను పరోక్షంగా హెచ్చరించడమేని.. దీనిని భారత నాయకత్వం గ్రహించలేదని కొందరు నిపుణులు అంటున్నారు. 

- సెంట్రల్‌ డెస్క్‌

Updated Date - 2020-06-18T13:41:36+05:30 IST