కరోనా కాటు.. యూఎస్‌లో మరో నలుగురు ఎన్నారైలు మృతి..!
ABN , First Publish Date - 2020-04-08T20:26:27+05:30 IST
అమెరికాలో వీర విహారం చేస్తున్న కరోనావైరస్ ఇప్పటికే 12వేలకు పైగా మందిని పొట్టనబెట్టుకుంది.

న్యూయార్క్: అమెరికాలో వీర విహారం చేస్తున్న కరోనావైరస్ ఇప్పటికే 12వేలకు పైగా మందిని పొట్టనబెట్టుకుంది. దేశవ్యాప్తంగా 4 లక్షలకు పైగా కరోనా బాధితులున్నారు. న్యూయార్క్ నగరం పరిస్థితి వర్ణణాతీతంగా మారింది. న్యూయార్క్ నగరంలోనే 1,42,38 మంది 'కొవిడ్-19' బారిన పడగా, 5,489 మంది మరణించారు. దీంతో ఈ నగర ప్రజలు మహమ్మారి కోరల్లో చిక్కుకుని బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇక మంగళవారం ఒక్కరోజే అమెరికాలోని వివిధ నగరాలలో నలుగురు ఎన్నారైలు మృత్యువాత పడ్డారు. ఈ నలుగురిలో ఇద్దరు న్యూయార్క్, ఒకరు టెక్సాస్, మరోకరు ఫిలాడెల్ఫియాలో చనిపోయారు.
కాగా, మృతి చెందిన నలుగురు కూడా కేరళ వాసులే. కేరళలోని ఇడుక్కీకి చెందిన పుతాంపూరక్కల్ మేరీ కోషీ(60) కరోనా బారిన పడి.. న్యూయార్క్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. పతనంతిట్టలోని కోఝేన్చేరికి చెందిన లాలు ప్రతాప్ జోస్(64) అనే వ్యక్తి మార్చి 16న కరోనా లక్షణాలతో ఫిలాడెల్ఫియా ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్న లాలు మంగళవారం మృతి చెందారు. ఇతను మెట్రోపాలిటన్ ట్రాన్సిట్ అథారిటీ ఉద్యోగి. అలాగే త్రిస్సూర్ స్థానికుడు టెన్నిసన్ పయూర్ న్యూయార్క్‌లో, కోడెన్చేరికి చెందిన పాల్ టెక్సాస్‌లో కరోనాతో కన్నుమూశారు.