అమెరికాలో టెన్షన్.. టెన్షన్...

ABN , First Publish Date - 2020-11-04T11:47:23+05:30 IST

అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే అమెరికాలోనూ హింస చెలరేగనుందా!? ట్రంప్‌ ఓడిపోతే ఆయన మద్దతుదారులైన శ్వేతజాతీయులు తుపాకులతో బయటకు వచ్చి కాల్పులు జరపనున్నారా!? బైడెన్‌ ఓడిపోయినా దాదాపు ఇదే పరిస్థితి తలెత్తనుందా!? అమెరికావ్యాప్తంగా అల్లర్లకు అవకాశం ఉందా!? ఈ ప్రశ్నలకు ‘ఔను’ అనే అంటున్నాయి అమెరికా నిఘా వర్గాలు.

అమెరికాలో టెన్షన్.. టెన్షన్...

ఫలితాలు వెలువడిన తర్వాత హింసకు చాన్స్‌

ప్రభుత్వం సహా ప్రతి ఒక్కరిలోనూ భయాందోళన

షాపులు, వ్యాపార సంస్థలకు ప్లైవుడ్‌తో రక్షణ

శ్వేతసౌధం చుట్టూ పదడుగుల ఇనుప ఫెన్సింగ్‌

వాషింగ్టన్‌/ న్యూయార్క్‌, నవంబరు 3: అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే అమెరికాలోనూ హింస చెలరేగనుందా!? ట్రంప్‌ ఓడిపోతే ఆయన మద్దతుదారులైన శ్వేతజాతీయులు తుపాకులతో బయటకు వచ్చి కాల్పులు జరపనున్నారా!? బైడెన్‌ ఓడిపోయినా దాదాపు ఇదే పరిస్థితి తలెత్తనుందా!? అమెరికావ్యాప్తంగా అల్లర్లకు అవకాశం ఉందా!? ఈ ప్రశ్నలకు ‘ఔను’ అనే అంటున్నాయి అమెరికా నిఘా వర్గాలు. అమెరికన్లలోనూ ఇవే ఆందోళన నెలకొంది. అల్లర్లు జరిగితే షాపుల్లో లూటీలు జరగవచ్చన్న భయం ప్రతి ఒక్కరిలోనూ ఉంది.


అందుకే, ఎవరికి వారు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. న్యూయార్క్‌ నుంచి వాషింగ్టన్‌ వరకూ; షికాగో నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో వరకూ వ్యాపార సంస్థలన్నీ భద్రతా చర్యలు తీసుకున్నాయి. గత ఏడాది జూన్‌లో జార్జి ఫ్లాయిడ్‌ను ఓ పోలీసు కాలితో తొక్కి చంపిన తర్వాత, అమెరికా అంతటా అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆందోళనకారులు షాపులను లూటీ చేశారు.


ఈ నేపథ్యంలోనే, మళ్లీ అల్లర్లు చెలరేగితే, షాపుల్లోకి వచ్చి సరుకులు దోచుకుని పోవడానికి వీల్లేకుండా ప్లైవుడ్‌, ఇతర చెక్కలతో రక్షణ కల్పిస్తున్నాయి. చివరికి, శ్వేతసౌధంతోపాటు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రముఖ వ్యాపార సంస్థల వద్ద భద్రతను పటిష్ఠం చేశారు. శ్వేతసౌధం చుట్టూ సీక్రెట్‌ సర్వీస్‌ ఏకంగా పది అడుగుల ఎత్తున ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసింది.  


ఎన్నికల తర్వాత న్యాయ వివాదాలే!

ఫలితాల తర్వాత అమెరికా అధ్యక్ష ఎన్నిక న్యాయ వివాదాల్లో చిక్కుకోనుంది. ఎవరు ఓడినా కోర్టులను ఆశ్రయించడం తప్పనిసరిగా కనిపిస్తోంది. తాను ఓడితే సుప్రీం కోర్టుకు వెళతానని ట్రంప్‌ ఇప్పటికే ప్రకటించారు. ఈ మేరకు ఇరు పార్టీలు, వాటి అభ్యర్థులు ప్రముఖ న్యాయవాదులను సంప్రదిస్తున్నారు. తక్కువ ఓట్లతో ఓడిపోతే న్యాయస్థానాలను ఆశ్రయించాలని భావిస్తున్నారు. నిజానికి, 2000 సంవత్సరం నుంచీ అమెరికా ఎన్నికలు న్యాయ వివాదాల్లో చిక్కుకుంటూనే ఉన్నాయి. 

Updated Date - 2020-11-04T11:47:23+05:30 IST