భారతీయుడ్ని హత్య చేసి.. 7 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న అమెరికన్ అరెస్ట్
ABN , First Publish Date - 2020-05-13T19:19:01+05:30 IST
భారత యువకుడిని హతమార్చి.. ఏడేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని లాస్ వెగాస్ మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ పోలీసులు, ఎఫ్‌బీఐ మంగళవారం అదుపులోకి తీసుకున్నాయి.

వాషింగ్టన్ డీసీ: భారత యువకుడిని హతమార్చి.. ఏడేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని లాస్ వెగాస్ మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ పోలీసులు, ఎఫ్‌బీఐ మంగళవారం అదుపులోకి తీసుకున్నాయి. వివరాల్లోకి వెళితే... పంజాబ్ రాష్ట్రం ఫతేగఢ్ సాహిబ్ పట్టణంలోని మజ్రీ కిష్నేవల్లికి చెందిన మన్‌ప్రీత్ ఘుమాన్ సింగ్(27) అనే యువకుడు కాలిఫోర్నియాలోని సౌత్ లేక్ తాహోలో గల ఓ గ్యాస్ స్టేషన్‌లో 2013, ఆగస్టు 6న గుర్తు తెలియని వ్యక్తి చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. ఏడేళ్ల దర్యాప్తు అనంతరం మంగళవారం ఈ హత్య చేసిన సీన్ డోనోహో(34)ను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌డీఐ), లాస్ వెగాస్ మెట్రోపాలిటన్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ ఘటన జరిగిన సమయంలో నిందితుడు డోనోహో... కాలిఫోర్నియాలోని సౌత్ లేక్ తాహోలో సిటీలోనే ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. హత్య జరిగిన రోజు ముఖానికి మాస్క్ ధరించి గ్యాస్ స్టేషన్‌కు వెళ్లిన నిందితుడు.. క్యాష్ కౌంటర్‌పై ఉన్న మన్‌ప్రీత్‌పై తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. అనంతరం అక్కడి నుంచి ఉడాయించాడు. అప్పటి నుంచి ఈ హత్య కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది. చివరకు ఎఫ్‌డీఐ చేతికి ఈ కేసు వెళ్లింది. 2017, జూలైలో ఈ ఘటనకు సంబంధించిన వీడియోను విడుదల చేశారు. దీంతో 2019, సమ్మర్‌లో ఓ వ్యక్తి ఈ వీడియో చూసి హంతకుడైన డోనోహోను తాను ప్రత్యక్షంగా చూసినట్లు ఎఫ్‌డీఐకి తెలిపాడు. అతని సమాచారంతో డోనోహో కోసం ఎఫ్‌డీఐ, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో నిందితుడు మంగళవారం అధికారులకు చిక్కాడు. ఇలా ఏడేళ్ల తర్వాత హంతకుడిని అధికారులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు.