ఉద్యోగులతో మార్క్ జూకర్‌బర్గ్ వీడియో కాల్.. నిర్ణయం మార్చుకోనంటూ..

ABN , First Publish Date - 2020-06-03T21:26:18+05:30 IST

‘దోపిడీ ప్రారంభమైతే.. షూటింగ్ ప్రారంభమవుతుంది’ అని అమెరికా అధ్యక్షుడు

ఉద్యోగులతో మార్క్ జూకర్‌బర్గ్ వీడియో కాల్.. నిర్ణయం మార్చుకోనంటూ..

వాషింగ్టన్: ‘దోపిడీ ప్రారంభమైతే.. షూటింగ్ ప్రారంభమవుతుంది’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరసనకారులకు వ్యతిరేకంగా పెట్టిన పోస్ట్ పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ పోస్ట్ తమ సంస్థ నియమాలకు వ్యతిరేకంగా ఉందంటూ ట్విటర్ సంస్థ ట్రంప్ ట్వీట్‌ను తొలగిస్తే.. ఫేస్‌బుక్ మాత్రం పోస్ట్‌ను తొలగించలేదు. దీంతో ఫేస్‌బుక్ ఉద్యోగులు సీఈఓ మార్క్ జూకర్‌బర్గ్ నిర్ణయాన్ని తప్పుపట్టారు. నిరసనకారులను కాల్చుతామంటూ దేశాధ్యక్షుడు పోస్ట్ పెడితే.. ఆ పోస్ట్‌ను సంస్థ తొలగించకపోవడంపై ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అనేక మంది తమ ఉద్యోగాలకు రాజీనామా చేసేందుకు కూడా సిద్దపడ్డారు. ఇదిలా ఉంటే.. మార్క్ జూకర్‌బర్గ్ మంగళవారం కంపెనీ ఉద్యోగులతో వీడియో కాల్‌లో మాట్లాడారు. తొంబై నిమిషాల పాటు సాగిన ఈ కాల్‌లో ఉద్యోగులు మార్క్ జూకర్‌బర్గ్‌పై విరుచుకుపడ్డారు. మార్క్ మాత్రం ట్రంప్ పోస్ట్‌కు సంబంధించి తన నిర్ణయాన్ని మార్చుకోనని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ట్రంప్ పోస్ట్‌పై తాను, కంపెనీ పాలిసీ టీం చర్చించామని, ఆ పోస్ట్ ఫే‌స్‌బుక్ నియమాలను ఉల్లంఘించలేదని మార్క్ తెలిపారు. హింసాత్మకంగా ఉండే పోస్ట్‌లకు సంబంధించి కంపెనీ నియమాలను మార్చాలా లేదా పోస్ట్‌లను తొలగించకుండా ఫ్లాగ్ చేయాలా అన్న దానిపై కంపెనీ ఆలోచిస్తోందని అన్నారు. కాగా.. శ్వేత పోలీసు అధికారి చేతిలో నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మరణించిన విషయం తెలిసిందే. జార్జ్ ఫ్లాయిడ్ మరణం తరువాత అమెరికా అట్టుడుకుతోంది. వారం రోజుల నుంచి అమెరికాలో పరిస్థితులు అదుపు తప్పాయి. అమెరికాలో ప్రస్తుతం కరోనా అంశం గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. కేవలం జార్జ్ ఫ్లాయిడ్ అంశమే అమెరికాను కుదిపేస్తోంది.  

Updated Date - 2020-06-03T21:26:18+05:30 IST