బేకరీ వర్కర్ హేయమైన చర్య..!
ABN , First Publish Date - 2020-04-07T17:40:55+05:30 IST
అజ్మాన్‌లో ఓ బేకరీలో పనిచేసే ప్రవాసీయుడు హేయమైన చర్యకు పాల్పడ్డాడు.

యూఏఈ: అజ్మాన్‌లో ఓ బేకరీలో పనిచేసే ప్రవాసీయుడు హేయమైన చర్యకు పాల్పడ్డాడు. వర్కర్ చేస్తున్న ఆ పనిని కస్టమర్ చూసి... వీడియో తీసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు సదరు వర్కర్‌ను అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. వివరాల్లోకి వెళితే... ఆసియా ప్రవాసీయుడు అజ్మాన్‌లో స్థానికంగా ఉండే ఓ బేకరీలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో బ్రేడ్ కోసం పిండి కలిపే సమయంలో దానిపై ఉమ్మివేయడం... అదే సమయంలో ఆ బేకరీకి వచ్చిన ఓ కస్టమర్ చూశాడు. దాంతో వెంటనే తన వద్ద ఉన్న మొబైల్‌తో వర్కర్ చర్యను వీడియో తీశాడు. అనంతరం అల్ జార్ఫ్ అల్ షమెల్ పోలీసులకు వీడియోతో సహా తీసుకెళ్లి ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సదరు వర్కర్‌ను అదుపులోకి తీసుకొని జైలుకు పంపారు. డైరెక్టర్ ఆఫ్ అల్ జార్ఫ్ అల్ షమెల్ పోలీస్ స్టేషన్ లెఫ్టినెంట్ కల్నల్ ముహమ్మద్ ముబారక్ అల్ గఫ్లీ మాట్లాడుతూ వర్కర్ చేసింది చాలా పెద్ద తప్పు అని అన్నారు. అజ్మాన్ చట్టాల ప్రకారం అతడికి కఠిన శిక్ష పడే అవకాశం ఉందని తెలిపారు.