మహిళా లాయర్‌కు దుబాయ్ 'గోల్డ్ వీసా'

ABN , First Publish Date - 2020-10-13T16:10:17+05:30 IST

జర్మనీకి చెందిన ప్రవాస మహిళా న్యాయవాది‌ జాస్మిన్ ఫిచ్టేకు దుబాయ్ సర్కార్ పదేళ్ల గోల్డ్ వీసాను అందించింది.

మహిళా లాయర్‌కు దుబాయ్ 'గోల్డ్ వీసా'

దుబాయ్: జర్మనీకి చెందిన ప్రవాస మహిళా న్యాయవాది‌ జాస్మిన్ ఫిచ్టేకు దుబాయ్ సర్కార్ పదేళ్ల గోల్డ్ వీసాను అందించింది. కాగా, ఈ వీసా అందుకున్న తొలి మహిళా న్యాయవాది జాస్మినే కావడం విశేషం. ఫిచ్టే కంపెనీ వ్యవస్థాపకురాలు, మేనేజింగ్ డైరెక్టర్ అయిన జాస్మిన్ 20 ఏళ్లుగా యూఏఈలోనే నివాసం ఉంటున్నారు. తాజాగా యూఏఈ సర్కార్ 70 దేశాలకు చెందిన సుమారు 6,800 మంది ప్రవాస పెట్టుబడిదారులు, నిపుణులకు ఈ గోల్డ్ వీసాలను అందజేసింది. యూఏఈలో ఈ 6,800 మంది ప్రవాసుల ఆస్తులు దాదాపు 100 బిలియన్ల దిర్హమ్స్ ఉంటాయని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు.


అలాగే వివిధ రంగాలకు చెందిన 2,500 మంది శాస్త్రవేత్తలు, పరిశోధకులు, వైద్యులకు దుబాయ్ శాశ్వత నివాసం కల్పించింది. కరోనా విపత్కర పరిస్థితుల్లో సేవలు అందించిన మరో 212 మంది వైద్యులకు యూఏఈ 10 పదేళ్ల వీసా ఇచ్చింది. ఇక గోల్డెన్ వీసా అందుకున్న టాప్ బిజినెస్ పర్సన్స్‌లో లులు గ్రూపు చైర్మన్ యూసుఫ్ అలీ, దనుబ్ గ్రూపు చైర్మన్ రిజ్వాన్ సాజన్, ఆస్టర్ డీఎం హెల్త్‌కేర్ చైర్మన్ డా. ఆజాద్ మూపెన్, ప్యూర్ గోల్డ్ జ్యువెలర్స్ చైర్మన్ ఫిరోజ్ మర్చంట్ ఉన్నారు.     

Updated Date - 2020-10-13T16:10:17+05:30 IST