తేరుకుని.. తెరుచుకుని..
ABN , First Publish Date - 2020-06-22T13:47:01+05:30 IST
కరోనా దెబ్బకు విలవిల్లాడిన యూరోపియన్ దేశాలు క్రమంగా కోలుకుంటున్నాయి. ఆయా దేశాల్లో కేసులు ఎప్పుడో ఏప్రిల్‌లోనే పతాకస్థాయికి చేరుకుని ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టి ఇప్పటికి కుదుటపడుతున్నాయి! అలాంటిది.. మనదేశంలో కేసు

- కోలుకుంటున్న యూరప్ దేశాలు
- పతాకస్థాయి నుంచి కనిష్ఠానికి కేసులు
కరోనా దెబ్బకు విలవిల్లాడిన యూరోపియన్ దేశాలు క్రమంగా కోలుకుంటున్నాయి. ఆయా దేశాల్లో కేసులు ఎప్పుడో ఏప్రిల్‌లోనే పతాకస్థాయికి చేరుకుని ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టి ఇప్పటికి కుదుటపడుతున్నాయి! అలాంటిది.. మనదేశంలో కేసుల సంఖ్య జూలైలో పతాకస్థాయికి చేరుతుందని అంటున్నారు. ఆ తర్వాత పూర్తిగా తగ్గుముఖం పట్టడానికి ఎంత కాలం పడుతుందో చెప్పడం కష్టమే. కొన్ని ము ఖ్య దేశాల్లో కేసులు, మరణాలు, లాక్‌డౌన్ ఆంక్షలు, పతాకస్థాయికి చేరాకసడలింపు అంశాలను పరిశీలిస్తే..
ఇటలీ.. రోజుకు 6 వేల కేసులు, 700 నుంచి 900 దాకా మరణాలతో.. ఆస్పత్రులు నిండిపోయి, రోడ్ల మీదే బెడ్లు వేసి కరోనా పేషెంట్లకు చికిత్స ఇవ్వాల్సిన ఘోరమైన దుస్థితి నుంచి కోలుకున్న ఇటలీలో ఇప్పుడు అన్‌లాక్ మూడో దశ నడుస్తోంది. ఇటలీలో మార్చి 21న 6,540 కేసులు నమోదయ్యాయి. మార్చి 27కు ఆ సంఖ్య 900 దాటింది. అది పతాకస్థాయి. ఆ తర్వాత కేసులు, మరణాల సంఖ్య తగ్గుతూ రావడంతో లాక్‌డౌన్ ఆంక్షలను సడలిస్తూ వచ్చారు. తాజాగా జూన్ 20న 265 కొత్త కేసులు నమోదవగా, 49 మంది మృతిచెందారు.
స్పెయిన్.. ఇటలీతో పోటీగా నిత్యం వేలాది కొత్త కేసులు.. వందల సంఖ్యలో మరణాలతో విలవిలలాడిన స్పెయిన్‌లో ఆదివారం నాటికి లాక్‌డౌన్ ఆంక్షలు పూర్తిగా ముగిశాయి. ఇక్కడ మార్చి 26న అత్యధికంగా 8,271 కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ 24 తర్వాత నుంచి కేసులు, మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో ఏప్రిల్ 28 నుంచి నాలుగు దశలుగా సడలించిన ఆంక్షలు ఆదివారంతో ముగిశాయి. జూన్ 20న 363 కేసులు నమోదవగా ఏడుగురు మృతి చెందారు.
ఫ్రాన్స్.. జనవరి 24న అక్కడ తొలి కేసు.. ఫిబ్రవరి 14న తొలి కరోనా మరణం నమోదయ్యాయి. మార్చి 31 నాటికి అత్యధికంగా ఒకేరోజు 7,578 మందికి పాజిటివ్ వచ్చింది. ఏప్రిల్ 15 నుంచి కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. జూన్ 20న 641 కొత్త కేసులు నమోదవగా 16 మంది మృతిచెందారు.
బ్రిటన్.. జనవరి చివరివారంలో బ్రిటన్‌కు పాకిన కరోనా వైరస్.. ఇప్పటిదాకా 3.03 లక్షల మందికి సోకి 47 వేల మందికి పైగా ప్రజల ప్రాణాలు తీసింది. మార్చి 14 నుంచి మే మూడో వారం దాకా నిత్యం వేలాది కేసులతో బ్రిటన్ అతలాకుతలమైపోయింది. మరణాలు ఏప్రిల్ మూడోవారానికి పతాకస్థాయికి చేరి తర్వాత తగ్గుముఖం పట్టాయి. దీంతో యూకేలో లాక్‌డౌన్ ఆంక్షలను కొంతమేర సడలించారు. జూన్ 20న 1295 కొత్తకేసులు, 128 మరణాలు సంభవించాయి.
అమెరికా.. జనవరి 20న తొలి కేసు నమోదైంది. మార్చి 23న తొలిసారి ఇక్కడ ఏకంగా 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఆరోజు నుంచి.. జూన్ 20 దాకా ఏరోజూ కేసుల సంఖ్య పదివేలకు తక్కువ నమోదుకాలేదు. మార్చి 23 నుంచి క్రమంగా పెరుగుతూ వెళ్లి ఏప్రిల్ 24న పతాకస్థాయికి చేరింది. ఆ ఒక్కరోజు అమెరికాలో 39,072 మందికి వైరస్ పాజిటివ్ వచ్చింది. ఏప్రిల్ 21న అత్యధికంగా 2,693 మంది మరణించారు. జూన్ 20న 33,388 కేసులు నమోదయ్యాయి.
మిగతా దేశాల్లో.. యూర్‌పలో కరోనా ప్రభావం మరీ యూకే, ఇటలీ, స్పెయిన్ స్థాయిలో లేని జర్మనీ, డెన్మార్క్, బెల్జియం, స్వీడన్, నెదర్లాండ్స్ వంటి దేశాల్లో దాదాపు లాక్‌డౌన్ ఆంక్షలన్నింటినీ కనిష్ఠ పరిమితులతో సడలించారు.
4 దేశాలు.. 4 లక్షల కేసులు
రష్యాలో తక్కువ మరణాలు.. ఆ తర్వాత మనదగ్గరే తక్కువ ఇప్పటిదాకా ప్రపంచంలో నాలుగు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదైన దేశాలు నాలుగే. అవి.. అమెరికా, రష్యా, బ్రెజిల్, భారతదేశం. కేసుల సంఖ్య నాలుగు లక్షలకు చేరేసమయానికి ఏ దేశంలో ఎన్ని మరణాలు నమోదయ్యాయో పరిశీలిస్తే..
అమెరికా: ప్రపంచంలో 4 లక్షల కరోనా కేసులు నమోదైన తొలి దేశం అమెరికా. ఏప్రిల్ 8న అక్కడ కేసుల సంఖ్య 4 లక్షల మార్కు దాటింది. ఏప్రిల్ 8 నాటికి అమెరికాలో కరోనా మరణాల సంఖ్య 17,731
బ్రెజిల్: అమెరికా తర్వాత నాలుగు లక్షల కేసులు నమోదైన దేశం బ్రెజిల్. మే 27న అక్కడ 4 లక్షల మందికి పైగా వైరస్ బారిన పడ్డారు. ఆ రోజుకు 25,697 మంది మరణించారు.
రష్యా: నాలుగు లక్షల కరోనా కేసులు నమోదైన మూడో దేశం రష్యా. మే 31న అక్కడ కేసుల సంఖ్య 4 లక్షలు దాటింది. ఆరోజుకు అక్కడ మరణించినవారు కేవలం 4,693 మంది.
భారత్: మనదేశంలో కేసుల సంఖ్య ఆదివారానికి నాలుగు లక్షలు దాటింది. 13 వేల మందికి పైగా కరోనా కాటుకు బలయ్యారు.
- సెంట్రల్ డెస్క్