ఎతిహద్ ఎయిర్‌లైన్స్ కీలక నిర్ణయం..!

ABN , First Publish Date - 2020-03-24T13:57:44+05:30 IST

కరోనావైరస్(కొవిడ్-19) వ్యాప్తి, నియంత్రణ నేపథ్యంలో యూఏఈ రెండు వారాలపాటు అన్ని విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

ఎతిహద్ ఎయిర్‌లైన్స్ కీలక నిర్ణయం..!

యూఏఈ: కరోనావైరస్(కొవిడ్-19) వ్యాప్తి, నియంత్రణ నేపథ్యంలో యూఏఈ రెండు వారాలపాటు అన్ని విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, బుధవారం నుంచి అన్ని రకాల విమాన సర్వీసులను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి అబుధాబికి చెందిన ఎతిహద్ ఎయిర్‌లైన్స్ సవరణలు చేసింది. విదేశాల నుంచి వచ్చే యూఏఈ పౌరులు, దౌత్యవేత్తలకు ఎతిహద్ తమ విమానాలు ఎక్కే సౌకర్యం కల్పించింది. అది కూడా కేవలం అబుధాబికి వచ్చేవారికి మాత్రమే ఈ అవకాశం ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు ఎతిహద్ సోమవారం ఒక ట్వీట్ చేసింది. 


మరోవైపు  మార్చి 25 నుంచి అన్ని రకాల విమాన సర్వీసులను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ కొన్ని మినహాయింపులు ఇచ్చింది. ప్రయాణికులు, ప్రభుత్వాల నుంచి వస్తున్న వినతులను దృష్టిలో ఉంచుకుని 13 దేశాలకు విమాన సర్వీసులను నడపనున్నట్లు వెల్లడించింది. యూకే, స్విట్జర్‌లాండ్, హాంగ్‌కాంగ్, థాయ్‌లాండ్, మలేషియా, ఫిలిప్పిన్స్, జపాన్, సింగపూర్, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, దక్షిణ ఆఫ్రికా, యూఎస్, కెనడాకు విమాన సర్వీసులను నడపనున్నట్టు ఎమిరేట్స్ తెలిపింది. అలాగే అత్యవసర తరలింపు విమానాలు, కార్గో విమానాలకు దీని నుంచి మినహాయింపు ఉంటుందని సీఏఏ పేర్కొంది. 

Read more