కన్నతల్లి కర్కశత్వం.. 28ఏళ్లుగా కొడుకును..!

ABN , First Publish Date - 2020-12-02T02:11:24+05:30 IST

నవమాసాలు మోసి.. జన్మనిచ్చిన తల్లే కొడుకుపట్ల కర్కశంగా వ్యవహరించిన ఘటన స్వీడన్‌లో చోటుచేసుకుంది. స్వీడన్‌కు చెందిన ఓ మహిళ తన కొడుకును దాదాపు 3 దశాబ్దాలపాటు ఓ గదిలో బంధించిన ఘ

కన్నతల్లి కర్కశత్వం.. 28ఏళ్లుగా కొడుకును..!

న్యూఢిల్లీ: నవమాసాలు మోసి.. జన్మనిచ్చిన తల్లే కొడుకుపట్ల కర్కశంగా వ్యవహరించిన ఘటన స్వీడన్‌లో చోటుచేసుకుంది. స్వీడన్‌కు చెందిన ఓ మహిళ తన కొడుకును దాదాపు 3 దశాబ్దాలపాటు ఓ గదిలో బంధించిన ఘటన తాజాగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. దాదాపు 30 సంవత్సరాల క్రితం స్వీడన్‌కు చెందిన మహిళ తన 12 ఏళ్ల కొడుకును స్కూల్‌ నుంచి బలవంతంగా ఇంటికి తీసుకొచ్చి గదిలో బంధించింది. ఈ క్రమంలో తాజాగా తీవ్ర అనారోగ్యానికి గురైన సదరు మహిళ.. దూరపు బంధువుకు ఫోన్ చేసి, తన పరిస్థితిని వివరించింది. ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిందిగా అభ్యర్థించింది. దీంతో సదరు మహిళ బంధువు అక్కడకు చేరుకున్నారు. అనారోగ్యానికి గురైన మహిళను ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే 28ఏళ్లుగా గదిలో బందీగా ఉన్న సదరు మహిళ కుమారుడ్ని దూరుపు బంధువు గుర్తించారు. నోట్లో పళ్లు ఊడిపోయి, నడవలేని స్థితిలో ఉన్న అతన్ని చూసి చలించిపోయి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు అతడ్ని ఆసుపత్రికి తరలించారు. అంతేకాకుండా అతని తల్లిపై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు. కాగా.. కొడుకు గురించి సదరు మహిళను ఎప్పుడు అడిగినా విషయాన్ని దాటవేసేదని ఆమె దూరపు బంధువు మీడియాకు తెలిపారు. అయితే 28ఏళ్లుగా గదిలో ఒంటరితనాన్ని అనుభవించిన వ్యక్తికి ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు. ఇదిలా ఉంటే.. సదరు మహిళ వయసు ప్రస్తుతం 70ఏళ్లు కాగా.. ఆమె కొడుకుకు 41ఏళ్లు. 


Updated Date - 2020-12-02T02:11:24+05:30 IST