విదేశీ టూరిస్టులకు గ్రీన్ సిగ్నల్.. గైడ్ లైన్స్ జారీ చేసిన దుబాయి సర్కారు

ABN , First Publish Date - 2020-06-23T20:07:38+05:30 IST

అంతర్జాతీయ రాకపోకలకు దుబాయి సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విదేశీయుల రాకకు కూడా ఆంక్షలు లేవని చెబుతోంది. విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది

విదేశీ టూరిస్టులకు గ్రీన్ సిగ్నల్.. గైడ్ లైన్స్ జారీ చేసిన దుబాయి సర్కారు

దుబాయి: అంతర్జాతీయ రాకపోకలకు దుబాయి సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విదేశీయుల రాకకు కూడా ఆంక్షలు లేవని చెబుతోంది. విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఇతర దేశాల నిర్ణయాలను బట్టి.. ఆయా దేశాలకు విమాన సర్వీసులను నడపాలో.. లేదో అన్నది విమానయాన సంస్థలు నిర్ణయం తీసుకుంటాయని స్పష్టం చేసింది. దీంతో కరోనా ఎఫెక్ట్ తో రద్దయిన అంతర్జాతీయ రాకపోకలను పునరుద్దరించిన దేశాల్లో దుబాయి మొదటి వరుసలో ఉంది.. యూఏఈలో రెసిడెన్సీ వీసా ఉన్న వారు ఈ నెల 23 నుంచి..విదేశీ పర్యాటకులు జూలై 7 నుంచి యూఏఈకి  రాకపోకలు సాగించవచ్చు. 


కాగా.. కనీసం 96గంటల్లోపు పరీక్షలు నిర్వహించి.. కరోనా లేదన్న సర్టిఫికెట్ ను పొందిన వారు దుబాయికి రావచ్చు. ఒక వేళ కరోనా పరీక్షలకు సంబంధించిన సర్టిఫికెట్ లేకుంటే.. విమానాశ్రయంలో కరోనా పరీక్షలు చేయించుకోవాలి. ఫలితం వచ్చే వరకు వేచిచూడాలి.. నెగిటివ్ ఫలితం ఉంటేనే విమానాశ్రయం దాటి బయటకు రావడానికి అనుమతినిస్తారు. పాజిటివ్ ఫలితం వస్తే కనుక 14రోజుల సుదీర్ఘ ఐసోలేషన్ లో పెడతారు. 


ఈ నియమం స్వదేశీయులే కాకుండా.. విదేశీయులకు కూడా వర్తిస్తుంది. విదేశాల్లో చిక్కుకుపోయిన యూఏఈ పౌరులంతా తప్పనిసరిగా ప్రభుత్వం నిర్దేశించిన పోర్టల్ లో అనుమతి తీసుకోవాలి. ఆ తర్వాతే విమాన టికెట్లను బుక్ చేసుకోవాలి. విదేశీ టూరిస్టులయితే మాత్రం తప్పనిసరిగా ఇంటర్నేషనల్ హెల్త్ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి. యూఏఈ నుంచి విదేశాలకు వెళ్లాలన్నా.. కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ ఉండి తీరాల్సిందే. 

Read more