హోలీ వేడుకలపై కరోనా ప్రభావం.. దుబాయిలో కూడా..!

ABN , First Publish Date - 2020-03-08T22:42:53+05:30 IST

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న విషయం తెలిసిందే. దీని కారణంగా ఇప్పటికే దాదాపు 3600 మంది మరణించగా.. సుమారు లక్ష మంది వైరస్ బారిన పడ్డారు

హోలీ వేడుకలపై కరోనా ప్రభావం.. దుబాయిలో కూడా..!

దుబాయి: కరోనా వైరస్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న విషయం తెలిసిందే. దీని కారణంగా ఇప్పటికే దాదాపు 3600 మంది మరణించగా.. సుమారు లక్ష మంది వైరస్ బారిన పడ్డారు. చైనాలోని వుహాన్‌లో మొదటగా ఉనికి చాటుకున్న కరోనా వైరస్.. క్రమంగా దాదాపు 90 దేశాలకు పాకింది. మొదటి కరోనా కేసు నమోదైనట్లు దుబాయి కూడా ఇటీవల ప్రకటించింది. కొవిడ్-19 మరింత ప్రభలకుండా.. అక్కడి ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జనసమూహాలపై ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో దుబాయిలోని దేవాలయాల్లో హోలీ వేడుకులను జరుపబోమని ఆలయ నిర్వాహకులు ప్రకటించారు. దుబాయిలోని శివ, కృష్ణ ఆలయ నిర్వాహకులు స్థానిక మీడియాతో మాట్లాడారు.


‘ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సంవత్సరం శ్రీనాథ్‌జీ(కృష్ణ) ఆలయంలో హోలీ వేడుకలు నిర్వహించడం లేదు’ అని దేవాలయ ఛైర్మన్ లలిత్ కరణి తెలిపారు. ‘ప్రతి సంవత్సరం హోలీ ముందు రోజు రాత్రి ఆవు పేడతో చేసిన పిడకలని కాల్చి, ఉదయం ఘనంగా వేడుకలను జరుపుతుంటాం. కరోనా వైరస్ నేపథ్యంలో.. ఇక్కడి అధికారుల సూచన ప్రకారం ఈ సంవత్సరం హోలీ వేడుకలను ఆలయ ప్రాంగణంలో నిర్వహించడం లేదు’ అని గురు దర్బార్ సింధి(శివ) ఆలయ జనరల్ మేనేజర్ మీడియాకు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు ఈ సంవత్సరం హోలీ వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. 


Updated Date - 2020-03-08T22:42:53+05:30 IST