దుబాయ్‌లో వృద్ధులు, 12 ఏళ్ల లోపు పిల్లలకు సడలింపు...
ABN , First Publish Date - 2020-06-18T19:18:27+05:30 IST
కర్ఫ్యూ సడలింపుల్లో భాగంగా తాజాగా దుబాయి కీలక నిర్ణయం తీసుకుంది.
దుబాయి: కర్ఫ్యూ సడలింపుల్లో భాగంగా తాజాగా దుబాయి కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్ తర్వాత ఇంతకుముందులా సాధారణ జీవనం వైపు అడుగులు వేసే క్రమంలో కర్ఫ్యూ నిబంధనలను ఒక్కొక్కటిగా సడిలిస్తోంది ఈ ఎమిరేటి కంట్రీ. దీనిలో భాగంగా దుబాయి సుప్రీం కమిటీ గురువారం నుంచి వృద్ధులు, 12 ఏళ్ల లోపు పిల్లలను సైతం షాపింగ్ మాల్స్, కమర్షియల్ సెంటర్లకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. అదేసమయంలో ముఖాలకు మాస్కులు ధరించడం, చేతులకు గ్లౌవ్స్ వేసుకోవడం, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి అని సూచించింది. బహిరంగ ప్రదేశాల్లో ఒకరికొకరు కనీసం రెండు మీటర్ల భౌతిక దూరం అనుసరించాలని స్పష్టం చేసింది.
యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధాన మంత్రి , దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్, హైనెస్ షేక్ మన్సూర్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ నేతృత్వంలోని సంక్షోభం మరియు విపత్తు నిర్వహణ సుప్రీం కమిటీ జూన్ 18, 2020 నుండి ఎమిరేట్‌లో కొత్త ఆర్థిక కార్యకలాపాలు మరియు సేవలను తిరిగి ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇదిలా ఉంటే... దుబాయిలో బుధవారం నాటికి మొత్తం కరోనా కేసులు 43,364 ఉండగా... కోలుకున్నవారు 29,537 మంది ఉన్నారు. మరో 13,532 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, కరోనాతో మరణించిన వారు 295 మంది అయ్యారు.