క‌రోనాపై పోరుకు దుబాయ్ స‌రికొత్త అస్త్రం 'స్మార్ట్ హెల్మెట్‌'

ABN , First Publish Date - 2020-04-15T17:37:34+05:30 IST

మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ‌కు దుబాయ్ ఇప్ప‌టికే క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌ల‌ను చేప‌డుతోంది.

క‌రోనాపై పోరుకు దుబాయ్ స‌రికొత్త అస్త్రం 'స్మార్ట్ హెల్మెట్‌'

దుబాయ్: మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ‌కు దుబాయ్ ఇప్ప‌టికే క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌ల‌ను చేప‌డుతోంది. తాజాగా క‌రోనాపై పోరులో దుబాయ్ మ‌రోసారి త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంది. 'కొవిడ్‌-19' వ్యాప్తిని అరిక‌ట్టే క్ర‌మంలో భాగంగా దుబాయ్ ర‌వాణా శాఖ స‌రికొత్త టెక్నాల‌జీతో కూడిన స్మార్ట్ హెల్మెట్‌ను తీసుకువ‌చ్చింది. క‌రోనా బాధితుల‌ను గుర్తించడంలో అధికారుల‌కు ఈ స్మార్ట్ హెల్మెట్ ఉప‌యోగప‌డ‌నుంది. ఇన్‌ఫ్రా రెడ్ కెమెరాతో పాటు ‌ఏఐ(అర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్) టెక్నాల‌జీ(ఫేస్ రికగ్నిషన్, కార్ నంబర్ రీడింగ్)లు దీని సొంతం. 


ఈ సంద‌ర్భంగా దుబాయ్‌ డిప్యూటీ చీఫ్ ఆఫ్ పోలీస్ అండ్ పబ్లిక్ సెక్యూరిటీ లెఫ్టినెంట్ జనరల్ దాహి ఖల్ఫాన్ త‌మీ మాట్లాడుతూ దుబాయ్ ర‌వాణా శాఖ తీసుకొచ్చిన కొత్త టెక్నాల‌జీతో కూడిన ఈ స్మార్ట్ హెల్మెట్ ప్ర‌య‌త్నాన్ని ప్ర‌శంసించారు. రవాణా రంగాన్ని భద్రపరచడంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలలో భాగంగా స్మార్ట్ హెల్మెట్‌ను వినియోగించడం మంచి ఆలోచ‌న అని అన్నారు. అలాగే రవాణా భద్రతా విభాగం డైరెక్టర్(దుబాయ్ పోలీస్‌) బ్రిగేడియర్ జనరల్ ఒబైద్ అల్ హాత్బూర్ ఎలా ప‌నిచేస్తుందో వివ‌రించారు. ఈ హెల్మెట్‌లో వాడిన‌ ఇన్‌ఫ్రా రెడ్ కెమెరా, ఏఐ టెక్నాల‌జీ(ఫేస్ రికగ్నిషన్, కార్ నంబర్ రీడింగ్)లు ప్ర‌యాణికులను స్కాన్ చేసి.. వారి శ‌రీర ఉష్ణోగ్ర‌త‌ల‌ను కొల‌వ‌డంలో ఉప‌యోగ ప‌డ‌తాయ‌ని తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తిని ఎదుర్కోవటానికి ఉత్తమ అంతర్జాతీయ ప్రమాణాలు మరియు పద్ధతులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక వినియోగంలో తాము ఎల‌ప్పుడు ముందు ఉంటామ‌ని ఒబైద్ అల్ హాత్బూర్ వెల్ల‌డించారు.  


Updated Date - 2020-04-15T17:37:34+05:30 IST