భారత సంతతి వ్యాపారవేత్త దాతృత్వం
ABN , First Publish Date - 2020-06-11T20:11:15+05:30 IST
దుబాయ్‌లో ఉండే భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త తన కంపెనీలో పనిచేసే ఉద్యోగులను స్వదేశానికి తరలించేందుకు ప్రత్యేకంగా చార్టర్ విమానం ఏర్పాటు చేసి దాతృత్వాన్ని చాటారు.

దుబాయ్: దుబాయ్‌లో ఉండే భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త తన కంపెనీలో పనిచేసే ఉద్యోగులను స్వదేశానికి తరలించేందుకు ప్రత్యేకంగా చార్టర్ విమానం ఏర్పాటు చేసి దాతృత్వాన్ని చాటారు. సుమారు 125 మంది ఉద్యోగులను షార్జా నుంచి కేరళలోని కొచ్చికి పంపించే ఏర్పాటు చేశారు ఎలైట్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండీ ఆర్ హరికుమార్. జూన్ 15న షార్జా నుంచి బయల్దేరనున్న ఎయిర్ అరేబియా విమానం మొత్తం 168 ప్రయాణికులతో భారత్‌కు రానుంది. కాగా... ఈ 125 మంది ఉద్యోగులకు పూర్తి ఉచితంగా తన సొంత ఖర్చులతో స్వదేశానికి పంపిస్తున్నట్లు హరికుమార్ తెలిపారు. అలాగే ఆయన మరో చార్టర్ విమాన ఏర్పాట్లలో కూడా ఉన్నారు. "నేను 300 విమాన టిక్కెట్లను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నాను. విమాన టికెట్ ఖర్చులలో 70 శాతం చెల్లిస్తాను." అని అన్నారు. అంతేగాక కరోనా సంక్షోభం వేళ తన ఉద్యోగులందరికీ ఒక నెల జీతంతో కూడిన సెలవు ఇస్తున్నట్లు హరికుమార్ తెలిపారు. ప్రస్తుతం ఉద్యోగులను మూడు నెలల సెలవులో భారత్‌కు పంపుతున్నట్లు చెప్పిన ఆయన... పరిస్థితి సాధారణమైనప్పుడు వారు తిరిగి రావడానికి కూడా ఏర్పాట్లు చేస్తానని చెప్పారు.