ఒకవేళ ఓడితే.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

ABN , First Publish Date - 2020-09-24T21:43:22+05:30 IST

రాబోయే ఎన్నికల్లో ఒకవేళ తాను ఓడితే.. ప్రశాంత వాతావరణంలో అధికార బాధ్యతలను అప్పగించేందుకు సుముఖంగా లే

ఒకవేళ ఓడితే.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

వాషింగ్టన్: రాబోయే ఎన్నికల్లో ఒకవేళ తాను ఓడితే.. ప్రశాంత వాతావరణంలో అధికార బాధ్యతలను అప్పగించేందుకు సుముఖంగా లేనని అమెరికా అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికాలో అధ్యక్ష పదవికి నవంబర్ 3న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యాయి. వివరాల్లోకి వెళితే.. బుధవారం రోజు శ్వేతసౌధంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. ‘ఒక వేళ ఎన్నికల్లో నేను ఓడితే ప్రశాంత వాతావరణంలో అధికార మార్పిడికి నేను ఏ మాత్రం ఒప్పుకోను. ప్రజలు నాకు ఓటు వేయకపోవడం వల్ల ఓడాననుకోను. మెయిల్ ఇన్ ఓటింగ్ వల్లే అలా జరిగిందని భావిస్తాను’ అంటూ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో అక్రమంగా గెలిచేందుకు డెమొక్రాటిక్ నేతలు.. మెయిల్ ఇన్ ఓట్ విధానాన్ని ప్రోత్సహిస్తున్నారని ట్రంప్ ఆరోపించారు. ఇదిలా ఉంటే.. అమెరికాలో కరోనా వైరస్ విలయం సృష్టిస్తోంది. అత్యధిక కరోనా మరణాలు అమెరికాలో నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో మెయిల్ ఇన్ ఓటింగ్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ట్రంప్ మాత్రం ఈ విధానాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. 


Updated Date - 2020-09-24T21:43:22+05:30 IST