ట్రంప్ సంతకంతో.. ఊపిరి పీల్చుకున్న అమెరికన్లు!

ABN , First Publish Date - 2020-12-28T16:53:04+05:30 IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మొండి పట్టు వీడారు. అగ్రరాజ్యాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయ

ట్రంప్ సంతకంతో.. ఊపిరి పీల్చుకున్న అమెరికన్లు!

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మొండి పట్టు వీడారు. అగ్రరాజ్యాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేసే బిల్లుపై యూటర్న్ తీసుకున్నారు. కరోనా విపత్తు నిర్వహణ, ప్యాకేజీ కొనసాగింపునకు సంబంధించిన 2.3 ట్రిలియన్ డాలర్ల బిల్లుపై ఆదివారం రాత్రి సంతకం చేశారు. దీంతో అమెరికా ఊపిరి పీల్చుకుంది. వివరాల్లోకి వెళితే.. కరోనా వైరస్ వల్ల అమెరికా అతలాకుతలం అయింది. అగ్రరాజ్య ఆర్థిక వ్యవస్థ గాడి తప్పింది. ఈ క్రమంలో దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అమెరికా ప్రతినిధుల సభ గత వారం 2.3 ట్రిలియన్ డాలర్ల బిల్లును ఆమోదించి.. సంతకం కోసం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వద్దకు పంపింది. అయితే అప్పటి వరకు ఈ ఉద్దీపన ప్యాకేజీని సమర్ధిస్తూ మాట్లాడిన ట్రంప్.. బిల్లు తన వద్దకు రాగానే అకస్మాత్తుగా నిర్ణయం మార్చుకున్నారు. 



అమెరికన్లకు మేలు కలిగించే నిధుల కంటే.. ఇతర కేటాయింపులే ఎక్కువ ఉన్నాయంటూ బిల్లుపై సంతకం చేసేందుకు నిరాకరించారు. దీంతో కరోనా నేపథ్యంలో నిరుద్యోగులకు, చిరు వ్యాపారులకు అందుతున్న ఆర్థిక సహాయం ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా విపత్తు నిర్వహణ ఖర్చులకూ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండటంతో.. ట్రంప్ వైఖరిపట్ల పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలో డొనాల్డ్ ట్రంప్.. ఆదివారం రోజు రాత్రి 2.3 ట్రిలియన్ డాలర్ల బిల్లుపై సంతకం చేశారు. దీంతో నిరుద్యోగులకు భారీ ఊరట లభించింది. మరో 11నెలలపాటు నిరుద్యోగులు ఆర్థిక సహాయాన్ని అందుకోవడానికి మార్గం సుగమం అయింది. 


Updated Date - 2020-12-28T16:53:04+05:30 IST