అమెరికాలో మళ్లీ లాక్‌డౌన్..!?

ABN , First Publish Date - 2020-06-18T20:36:06+05:30 IST

అమెరికాలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యాయి. అమెరికాలో

అమెరికాలో మళ్లీ లాక్‌డౌన్..!?

వాషింగ్టన్: అమెరికాలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యాయి. అమెరికాలో మళ్లీ లాక్‌డౌన్ ప్రకటిస్తారా? అనే ప్రశ్నకు ట్రంప్ బదులిస్తూ..కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికాలో కరోనా విజృంభించడంతో అక్కడి ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను అమలు చేసింది. దీంతో కోట్లాది మంది అమెరికన్లు ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. ఈ నేపథ్యంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అయింది. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలోపెట్టేందుకు రంగంలోకి దిగిన ట్రంప్.. లాక్‌డౌన్ నిబంధనలను ఎత్తేయాలని రాష్ట్ర గవర్నర్‌లను కోరారు.  ఈ క్రమంలో ఇప్పుడిప్పుడే.. అమెరికాలో వ్యాపార సముదాయాలు తెరుచుకుంటున్నాయి. ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. దీంతో అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. కొవిడ్-19 కేసులు, మరణాల సంఖ్య రికార్డు‌స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో అమెరికాలో మళ్లీ లాక్‌డౌన్ ప్రకటిస్తారనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో స్థానిక మీడియా.. లాక్‌డౌన్ అంశంపై ట్రంప్‌ను ప్రశ్నించింది. దీంతో స్పందించిన ట్రంప్.. అమెరికాలో ఎట్టిపరిస్థితుల్లో మళ్లీ లాక్‌డౌన్‌ను అమలు చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇదే విషయాన్ని శ్వేత‌సౌధం ప్రతినిధులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. అమెరికాలో ఇప్పటి వరకు దాదాపు 22లక్షల మంది కరోనా బారినపడగా.. సుమారు 1.20లక్షల మంది మహమ్మారికి బలయ్యారు. 


Updated Date - 2020-06-18T20:36:06+05:30 IST