మానవత్వం చాటుకున్న ట్యాక్సీ డ్రైవర్.. సర్‌ప్రైజ్ ఇచ్చిన వైద్యులు
ABN , First Publish Date - 2020-04-22T02:27:31+05:30 IST
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ఇదే సమయంలో ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ అనేక మంది మానవత్వాన్ని

మ్యాడ్రిడ్: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ఇదే సమయంలో ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ అనేక మంది మానవత్వాన్ని చాటుకుంటున్నారు. తాజాగా స్పెయిన్‌లో మానవత్వం చాటుకున్న ఓ ట్యాక్సీ డ్రైవర్‌కు వైద్యు సిబ్బంది సర్‌ప్రైజ్ ఇచ్చారు. మ్యాడ్రిడ్‌లో ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి రోగులకు ఉచితంగా క్యాబ్ సర్వీస్ అందిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న వైద్యులు అతడి కోసం సర్‌ప్రైజ్ సిద్దం చేశారు. ట్యాక్సీ డ్రైవర్ ఆసుపత్రిలోకి వచ్చిన వెంటనే వైద్య సిబ్బంది మొత్తం కరతాళ ధ్వనులతో అతడికి ధన్యవాదాలు తెలిపారు.
అంతేకాకుండా అతడు చేసిన సాయానికి డబ్బును కూడా అందించారు. దీంతో ట్యాక్సీ డ్రైవర్ ఒక్కసారిగా కంటతడి పెట్టి భావోద్వేగానికి గురయ్యాడు. రోగిని తీసుకెళ్లడానికి ఆసుపత్రిలోనికి వచ్చిన తనకు ఇలాంటి సందర్భం ఎదురవుతుందని అతడు అనుకోలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయింది. ఇప్పటివరకు ఈ వీడియోను కోటి మందికి పైగా వీక్షించారు. ఇలాంటి హీరోలే సమాజానికి అవసరమంటూ నెటిజన్లు ట్యాక్సీ డ్రైవర్‌ను తెగ పొగుడుతున్నారు.