పని చేసే హాస్పటల్లోనే ఒక్కటైన నర్సు, డాక్టర్.. ఫొటోలు వైరల్!
ABN , First Publish Date - 2020-05-30T00:24:47+05:30 IST
కరోనా వైరస్ నేపథ్యంలో వారు సేవలందించే హాస్పటల్లోనే ఓ నర్సు, డాక్టర్ పెళ్లి బంధంతో ఒక్కటైన ఘటన యూకేలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. జాన్ టిప్పిం

లండన్: కరోనా వైరస్ నేపథ్యంలో వారు సేవలందించే హాస్పటల్లోనే ఓ నర్సు, డాక్టర్ పెళ్లి బంధంతో ఒక్కటైన ఘటన యూకేలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. జాన్ టిప్పింగ్ (34), అన్నలన్ నవరత్నమ్ (30).. లండన్లోని సెయింట్ థామస్ హాస్పటల్లో విధులు నిర్వరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రేమలో పడ్డ వీరిద్దరూ కుటుంబ సభ్యుల సమక్షంలో ఆగస్టులో అంగరంగవైభవంగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకు కావాల్సిన ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నారు. అయితే కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుండటంతో వీరి ప్లాన్ ఫెయిల్ అయింది. దీంతో వారు పని చేస్తున్న హాస్పటల్లోనే ఏప్రిల్లో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. పెళ్లిని వారి కుటుంబ సభ్యులు ఆన్లైన్లో వీక్షించారు. కాగా.. వారి పెళ్లికి సంబంధించిన ఫొటోలను.. హాస్పటల్ యాజమాన్యం తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అవి వైరల్గా మారాయి. దీంతో స్పందించిన జాన్ టిప్పింగ్.. అందరూ బాగున్నప్పుడే పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఏప్రిల్లో వివాహం చేసుకున్నట్లు వివరించారు.