టిక్‌టాక్ వాడొద్దంటూ హెచ్చరించిన డెమొక్రటిక్, రిపబ్లికన్ పార్టీలు

ABN , First Publish Date - 2020-07-15T02:21:29+05:30 IST

అమెరికాలోని ప్రముఖ రిపబ్లికన్, డెమొక్రటిక్ రాజకీయ పార్టీలు టిక్‌టాక్ వాడొద్దంటూ

టిక్‌టాక్ వాడొద్దంటూ హెచ్చరించిన డెమొక్రటిక్, రిపబ్లికన్ పార్టీలు

వాషింగ్టన్: అమెరికాలోని ప్రముఖ రిపబ్లికన్, డెమొక్రటిక్ రాజకీయ పార్టీలు టిక్‌టాక్ వాడొద్దంటూ తమ సిబ్బందికి హెచ్చరికలు చేశాయి. డెమొక్రటిక్ నేషనల్ కమిటి(డీఎన్‌సీ), రిపబ్లికన్ నేషనల్ కమిటి(ఆర్ఎన్‌సీ)కి చెందిన ప్రతినిధులు టిక్‌టాక్ వాడటం వల్ల భద్రతకు ముప్పు ఉందని సిబ్బందికి తెలియజేశాయి. అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికలు నవంబర్ మూడో తేదీన జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు పార్టీలకు చెందిన క్యాంపెయిన్ సిబ్బంది టిక్‌టాక్ యాప్ ద్వారా కూడా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అయితే టిక్‌టాక్ ద్వారా ప్రచారం నిర్వహించాలంటే ప్రత్యేకంగా వేరే ఫోన్, అకౌంట్‌ను వాడుకోవాల్సిందిగా ఇరు పార్టీలు సిబ్బందికి సూచిస్తున్నాయి. సొంత ఫోన్‌లలో మాత్రం టిక్‌టాక్‌ను అసలు ఇన్‌‌స్టాల్ చేయవద్దని తేల్చిచెబుతున్నాయి. టిక్‌టాక్‌తో పాటు రష్యాకు చెందిన ఫేస్‌యాప్‌ను సైతం వాడొద్దని డెమొక్రటిక్, రిపబ్లికన్ పార్టీలు సూచిస్తున్నాయి. ఈ యాప్‌లు ప్రపంచదేశాలకు చెందినవి కావడంతో.. ఆయా దేశ ప్రభుత్వాలు అమెరికన్ల డేటాను దొంగిలించే అవకాశం ఉందని ఇరు పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 


ఇదిలా ఉంటే.. ఇరు పార్టీలు టిక్‌టాక్ వాడొద్దంటూ హెచ్చరికలు చేయడంపై టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ స్పందించింది. తమ యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని, భద్రతను కాపాడటానికి తాము కట్టుబడి ఉన్నామని ప్రకటన విడుదల చేసింది. అమెరికా సీఈఓ నాయకత్వంలో అమెరికన్ల భద్రతకు సంబంధించి మౌలిక సదుపాయాలను మరింత అభివృద్ధి చేయడానికి పనిచేస్తామని తెలిపింది. కాగా.. అమెరికాలో టిక్‌టాక్‌ను బ్యాన్ చేయాలని గత కొంతకాలం నుంచి అనేక మంది ఎంపీలు, నిపుణులు కోరుతున్నారు. భారత ప్రభుత్వం టిక్‌టాక్ యాప్‌ను బ్యాన్ చేయడాన్ని కూడా అమెరికా ప్రభుత్వం సమర్థించింది. మరోపక్క అమెరికా కూడా త్వరలోనే టిక్‌టాక్‌ను బ్యాన్ చేసే అవకాశముందని వార్తలొస్తున్నాయి. 

Updated Date - 2020-07-15T02:21:29+05:30 IST