కొత్త ఇల్లు నచ్చక.. అమెరికాలో ఓ కుక్క ఏం చేసిందంటే..
ABN , First Publish Date - 2020-07-19T07:40:11+05:30 IST
అమెరికాలో ఓ కుక్క పాత ఇంటికి చేరుకునేందుకు దాదాపు వంద కిలోమీటర్లు

లాసన్, మిస్సౌరి: అమెరికాలో ఓ కుక్క పాత ఇంటికి చేరుకునేందుకు దాదాపు వంద కిలోమీటర్లు ప్రయాణించింది. వివరంగా చెప్పాలంటే.. క్లియో అనే నాలుగేళ్ల కుక్క కాన్సాస్‌లోని ఓలత్ ప్రాంతంలోని ఓ ఇంటి వాకిలిలో సేదతీరడాన్ని ఆ ఇంటి యజమానులు చూశారు. క్లియో ఎంతసేపటికి అక్కడి నుంచి వెళ్లకపోవడంతో.. ఆ ఇంట్లో నివసిస్తున్న మైఖేల్, అతని భార్య బ్రిట్నీ క్లియో దగ్గరకు వచ్చి మైక్రోచిప్ కోసం వెతికారు. కుక్కకు మైక్రోచిప్ ఉండటంతో.. ఆ చిప్ ద్వారా కుక్క యజమాని పేరు, అడ్రస్ తెలుసుకున్నారు. అయితే చిప్‌లోని అడ్రస్ ఏదైతే ఉందో.. ఆ అడ్రస్‌కు సంబంధించిన ఇంట్లోనే ప్రస్తుతం మైఖేల్, బ్రిట్నీ నివసిస్తున్నారు. దీంతో వారిద్దరూ ఆశ్చర్యానికి గురయ్యారు. మైఖేల్ వెంటనే క్లియో యజమానికి ఫోన్ చేసి అసలు విషయం చెప్పాడు.
క్లియో యజమాని వెంటనే కాన్సాస్‌లోని తన పాత ఇంటికి చేరుకున్నాడు. తన కుక్క వారం రోజుల నుంచి కనిపించడం లేదని ఆయన చెప్పుకొచ్చాడు. తాము ఇంతకుముందు ఉన్న ఇంటి వద్దకు క్లియో వస్తుందని తాను ఊహించలేదన్నాడు. తాను ప్రస్తుతం మిస్సౌరిలోని లాసన్‌లో జీవిస్తున్నాని.. క్లియో కూడా తనతోనే ఉంటోందని అన్నాడు. క్లియో యజమాని చెప్పిన దాని ప్రకారం.. క్లియో లాసన్ నుంచి కాన్సాస్‌లోని ఓలత్ వరకు(96 కిలోమీటర్లు) వారం రోజుల పాటు ప్రయాణించింది. లాసన్ నుంచి ఓలత్‌కు రావాలంటే.. మధ్యలో నది కూడా దాటాల్సి ఉంటుందని.. మరి క్లియో నదిని ఏ విధంగా దాటుకుని వచ్చిందోనని మైఖేల్, క్లియో యజమాని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. క్లియో అంటే తనకు ఎంతో ఇష్టమని.. మళ్లీ క్లియోను చూడటం ఎంతో ఆనందంగా ఉందని క్లియో యజమాని చెప్పాడు.