బిల్లు రూ.500.. టిప్పు రూ.2.21 లక్షలు !

ABN , First Publish Date - 2020-11-27T23:46:55+05:30 IST

అమెరికాలో ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన ఓ కస్టమర్.. ఆ రెస్టారెంట్‌ యజమానికి సర్‌ప్రైజ్‌ గిఫ్ట్ ఇచ్చాడు.

బిల్లు రూ.500.. టిప్పు రూ.2.21 లక్షలు !

'అజ్ఞాత' కస్టమర్‌ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్ ! 

క్లీవ్‌లాండ్‌: అమెరికాలో ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన ఓ కస్టమర్.. ఆ రెస్టారెంట్‌ యజమానికి సర్‌ప్రైజ్‌ గిఫ్ట్ ఇచ్చాడు. ఆ గిఫ్ట్ చూసిన యజమాని కొద్దిసేపు తనను తాను నమ్మలేకపోయాడు. ఇంతకు కస్టమర్ ఇచ్చిన గిఫ్ట్ ఎంటో తెలుసా? రూ. 500 పెట్టి ఒక బీర్ తాగిన కస్టమర్.. టిప్పుతో కలిపి ఏకంగా రూ. 2.21 లక్షల బిల్లు చెల్లించాడు. మొదట ఆ టిప్పు అమౌంట్ చూసిన యజమాని నమ్మలేదు. ఏదో పొరపాటు జరిగి ఉంటుందని... బిల్లు చెల్లించి బయటకు వెళ్లిపోయిన కస్టమర్‌ను వెనక్కి పిలిచి కనుగొన్నాడు. కానీ, తాను ఏ విధంగాను పొరబడలేదని.. టిప్పు రూపంలోనే 3వేల డాలర్లు ఇచ్చానని.. డ్యూటీలో ఉన్న స్టాఫ్ అందరికీ పంచిపెట్టమని చెప్పి కస్టమర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అమెరికాలోని ఓహియో రాష్ట్రం క్లీవ్‌లాండ్‌ నగరంలోని ఓ రెస్టారెంట్‌‌లో ఆదివారం ఈ ఘటన జరిగింది. 7 డాలర్ల (రూ. 500) బిల్లుకి 3,000 డాలర్ల (రూ. 2.21 లక్షలు) టిప్పు కలిపి మొత్తం 3,007 డాలర్లు చెల్లించాడు కస్టమర్. 


రెస్టారెంట్‌ యజమాని బ్రెండన్‌ రింగ్‌ మాట్లాడుతూ... "ఓహియోలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నందున రెస్టారెంట్‌ను స్వచ్ఛందంగా జనవరి వరకూ మూసివేయాలనుకున్నాం. చివరి రోజు కావడంతో ఆదివారం రెస్టారెంట్‌ జనాలతో కిటకిటలాడుతోంది. ఇంతలో ఓ కస్టమర్‌ లోపలికొచ్చాడు. ఒక స్టెల్లా డ్రింక్‌(బీరు) ఆర్డర్‌ చేశాడు. అతను అడిగిన డ్రింక్‌ను సర్వర్ జోసెఫ్ తీసుకెళ్లి ఇచ్చాడు. అది తాగిన తర్వాత బిల్లు తీసుకురావాల్సిందిగా చెప్పాడు. సర్వర్ తెచ్చిన ఆ బిల్లు తీసుకుని నా టేబుల్‌ వద్దకు వచ్చాడు. బిల్లు చెల్లించి 'గుడ్‌లక్‌. మళ్లీ కలుద్దాం!' అని వెళ్లిపోయాడు. ఆ బిల్లుపై టిప్పుగా ఉన్న 3వేల డాలర్లను చూసి నేను నమ్మలేదు. ఏదో పొరపాటు జరిగి ఉంటుందని.. వెంటనే బయటకు పరుగు తీసి అతన్ని కలిశాను. ఏమైనా పొరబడ్డారా? అని అడిగాను. 'లేదు. తెలిసే ఇచ్చాను. దాన్ని స్టాఫ్‌ అందరికీ పంచండి. తన పేరు మాత్రం బయటపెట్టొదని' చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇక ఈ విషయం మొదట ఓ సర్వర్‌కు చెబితే నమ్మలేదు. ఆ రోజు నలుగురు డ్యూటీలో ఉండడంతో వారికి తలో 750 డాలర్లు పంచిపెట్టాను" అని రింగ్ చెప్పుకొచ్చాడు. కాగా, పెద్ద మనసు చాటిన ఆ ‘అజ్ఞాత’ కస్టమర్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.  

Read more