యూకేలో అదుపులోకి వస్తున్న కరోనా మహమ్మారి
ABN , First Publish Date - 2020-11-25T08:53:39+05:30 IST
యూకేలో కరోనా మహమ్మారి అదుపులోకి వస్తున్నట్టు కనపడుతోంది. మంగళవారం యూకే వ్యాప్తంగా 11,299 కరోనా కేసులు నమోదయ్యాయి.

లండన్: యూకేలో కరోనా మహమ్మారి అదుపులోకి వస్తున్నట్టు కనపడుతోంది. మంగళవారం యూకే వ్యాప్తంగా 11,299 కరోనా కేసులు నమోదయ్యాయి. గత కొద్ది రోజులుగా యూకేలో నిత్యం దాదాపు 20 వేల కేసులు నమోదవుతూ వచ్చాయి. అయితే నవంబర్ 19 నుంచి కేసుల్లో కొంత తగ్గుదల కనపడుతోంది. సోమవారం దేశవ్యాప్తంగా 15 వేలకు పైగా కేసులు నమోదైతే.. మంగళవారం ఈ సంఖ్య 11 వేలకు పడిపోయింది. దీంతో ఆరోగ్యశాఖ కొంతమేర ఉపశమనం పొందినట్టు అయింది. యూకేలో ప్రస్తుతం కరోనా నిబంధనలను అధికారులు కఠినంగా అమలు చేస్తున్నారు. డిసెంబర్ రెండో తేదీ వరకు ఈ నిబంధనలు కొనసాగనున్నట్టు ఇప్పటికే ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా.. యూకేలో ఇప్పటివరకు మొత్తం 15,38,794 కరోనా కేసులు నమోదయ్యాయి. మరోపక్క కరోనా బారిన పడి యూకేలో మొత్తం 55,838 మంది మృత్యువాతపడ్డారు. కరోనా బారిన పడి 50 వేల మంది చనిపోయిన మొదటి యూరప్ దేశంగా యూకే రికార్డు కొట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో యూకే ఏడో స్థానంలో ఉంది. మరణాల సంఖ్యలో చూస్తే ఐదో స్థానంలో నిలిచింది.