'క‌రోనా' ల్యాబ్‌లో పుట్టింది కాదు.. సహజమే!

ABN , First Publish Date - 2020-05-13T13:47:58+05:30 IST

కొవిడ్‌-19 వైరస్‌ ల్యాబ్‌లో పుట్టిందా? సహజంగానే ఉద్భవించిందా? అనే దానిపై ప్రపంచవ్యాప్తంగా వాడివేడి చర్చ జరుగుతోంది.

'క‌రోనా' ల్యాబ్‌లో పుట్టింది కాదు.. సహజమే!

కొవిడ్‌-19 పుట్టుక సహజమే!!

‘ఆర్‌ఎంవైఎన్‌02’ వైరస్‌ విశ్లేషణ

బీజింగ్‌, మే 12: కొవిడ్‌-19 వైరస్‌ ల్యాబ్‌లో పుట్టిందా? సహజంగానే ఉద్భవించిందా? అనే దానిపై ప్రపంచవ్యాప్తంగా వాడివేడి చర్చ జరుగుతోంది. చైనాలోని షాన్‌డాంగ్‌ ఫస్ట్‌ మెడికల్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు మాత్రం అది సహజంగా ఏర్పడిన వైరసే అని వాదిస్తున్నారు. యునాన్‌ ప్రావిన్స్‌లోని 227గబ్బిలాల నుంచి శాంపిళ్లు సేకరించి విశ్లేషించిన తర్వాతే ఈ నిర్ధారణకు వచ్చామన్నారు. మలయన్‌ హార్స్‌షూ జాతికి చెందిన గబ్బిలాల్లో గుర్తించిన ‘ఆర్‌ఎంవైఎన్‌02’ అనే వైర్‌సకు, కరోనా వైర్‌సకు జన్యుపరంగా దగ్గరి పోలికలు ఉన్నట్లు గుర్తించారు. ‘ఆర్‌ఎంవైఎన్‌02’ వైరస్‌ స్పైక్‌ ప్రొటీన్లలోని ఎస్‌1, ఎస్‌2 సబ్‌ యూనిట్లలో ఉండే అమైనో యాసిడ్ల పొందిక.. అచ్చం కొవిడ్‌-19ను తలపించేలా ఉందని తెలిపారు. అంతమాత్రాన ఆ రెండు వైర్‌సలూ ఒకేవర్గానికి చెందినవని చెప్పలేమన్నారు. కాలక్రమంలో కరోనా వైర్‌సల జన్యువులు, స్పైక్‌ ప్రొటీన్ల నిర్మాణంలో జరిగిన సహజ మార్పులకు దీన్ని ఒక ఉదాహరణగా పేర్కొన్నారు. ల్యాబ్‌లో కరోనా పుట్టలేదనేందుకు ఇది ఒక నిదర్శనమని స్పష్టంచేశారు.

Updated Date - 2020-05-13T13:47:58+05:30 IST