కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్‌లో పాల్గొన్న మొదటి వ్యక్తి..

ABN , First Publish Date - 2020-03-20T03:43:24+05:30 IST

‘‘నేను ఓ చిన్న టెక్‌ కంపెనీలో ఆపరేషన్స్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నాను. నాకు ఆఫీసు, కుటుంబమే ప్రపంచం. నాకు టీనేజ్‌ కొడుకు, కూతురు ఉన్నారు. వాళ్లకు లంచ్‌ బాక్సులు రెడీ చేయడం, స్కూలుకు పంపడం,

కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్‌లో పాల్గొన్న మొదటి వ్యక్తి..

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఎవరూ కూడా మాస్క్‌ లేకుండా కాలు బయటపెట్టడం లేదు. ప్రయాణాలు పూర్తిగా మానుకుంటున్నారు. మరోవైపు వైద్య నిపుణులు కరోనా కట్టడికి వ్యాక్సిన్‌ ప్రయోగాల్లో బిజీగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాలోని సియాటెల్‌కు చెందిన జెన్నీఫర్‌ హాలర్‌ అనే 43 ఏళ్ల మహిళ కరోనా వ్యాక్సిన్‌ ట్రయల్స్‌లో పాల్గొన్న మొదటి వ్యక్తిగా గుర్తింపు పొందింది. క్లినికల్‌ ట్రయల్స్‌లో ఆమె ఎందుకు పాల్గొనాల్సి వచ్చింది? కుటుంబ సభ్యులు ఆమె నిర్ణయాన్ని సమర్థించారా? ఆ విశేషాలు ఆమె మాటల్లోనే...


‘‘నేను ఓ చిన్న టెక్‌ కంపెనీలో ఆపరేషన్స్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నాను. నాకు ఆఫీసు, కుటుంబమే ప్రపంచం. నాకు టీనేజ్‌ కొడుకు, కూతురు ఉన్నారు. వాళ్లకు లంచ్‌ బాక్సులు రెడీ చేయడం, స్కూలుకు పంపడం, తరువాత నేను ఆఫీసుకు బయలుదేరడం... రోజూ నా దినచర్య ఇది. అయితే కరోనా మూలంగా మొత్తం పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. స్కూళ్లకు సెలవులు ఇచ్చేశారు. వైరస్‌ నియంత్రించడంలో భాగంగా ఆఫీసుకు రానక్కర్లేదని, ఇంటి నుంచే పనిచేయాలని ఆదేశాలొచ్చాయి. నా భర్త సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. ఇటీవలే ఆయన ఉద్యోగం కూడా పోయింది. మాపైనే కాదు, కరోనా ప్రభావం చాలా కుటుంబాలపై పడింది. 


ఏదైనా చేయాలని...!

కరోనా విస్తరించకుండా ఎవరికి వారే జాగ్రత్తలు తీసుకోవడం కాకుండా, ఇంకా ఏమైనా చేయగలమా అనిపించేది. కానీ ఏం చేయాలో, ఎలా చేయాలో అర్థమయ్యేది కాదు. ఒకరోజు ఫేస్‌బుక్‌లో కరోనా వ్యాక్సిన్‌కు సంబంఽధించి మనుషులపై క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తున్నట్టు చదివాను. వెంటనే నా అప్లికేషన్‌ను పంపించా. నేను ఎంపికవుతానని అనుకోలేదు. అయితే ఎంపికయితే బాగుంటుందని అనుకున్నా. రెండు రోజుల తరువాత కుటుంబ సభ్యులతో కలిసి డిన్నర్‌ చేస్తున్న సమయంలో ఒక తెలియని నంబరు నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చింది. ‘డిన్నర్‌ చేస్తున్న తర్వాత చేయమ’ని వారికి చెప్పా. కానీ ఫోన్‌లోనే వారు కాస్త అసహనంగా ఉన్నారనిపించి ‘ఒక్క నిమిషం’ అంటూ ఫోన్‌ అటెండ్‌ చేశా. వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ను నిర్వహించే రీసెర్చ్‌ టీమ్‌ సభ్యుడొకరు ఆ కాల్‌ చేశారు. ‘ట్రయల్స్‌లో పాల్గొనడం మీకు సమ్మతమేనా?’ అని అడిగారు. ‘సమ్మతమే’ అని చెప్పాను. నా హెల్త్‌ హిస్టరీకి సంబంధిచి కొన్ని ప్రశ్నలు అడిగారు. అలా క్లినికల్‌ ట్రయల్స్‌ పాల్గొనే అవకాశం లభించింది. కరోనా వల్ల అందరూ బాధపడుతున్నా ఏం చేయలేకపోతున్నామే అన్న బాధ ఉండేది. కానీ ఇది ఒక మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను.


మొదటి వ్యాక్సిన్‌ నాపైనే!

ట్రయల్స్‌లో భాగంగా మొత్తం 45 మందిపై వ్యాక్సిన్‌ ప్రయోగం నిర్వహిస్తున్నారు. ఇందులో మొదటి వ్యక్తిని నేను. నా రక్తం శాంపిల్‌ తీసుకున్నారు. అంతా సరిగా ఉందని నిర్ధారించుకున్నాక ‘ఫస్ట్‌ వ్యాక్సిన్‌ మీకే’ అని చెప్పారు. అలా కరోనా వ్యాక్సిన్‌ను తీసుకున్న మొదటి వ్యక్తినయ్యా. వ్యాక్సిన్‌ ఇచ్చినప్పుడు పెద్దగా నొప్పి అనిపించలేదు. వాపు కూడా రాలేదు. వ్యాక్సిన్‌ తీసుకున్నాక రెండు వారాల పాటు అబ్జర్వేషన్‌లో ఉండాలని చెప్పారు. జ్వరం, ఇతర లక్షణాలను పరిశీలిస్తామన్నారు. వారానికోసారి శాంపిల్స్‌ తీసుకుని పరీక్షిస్తామని చెప్పారు. నాలుగు వారాల తరువాత సెకండ్‌ డోస్‌ వ్యాక్సిన్‌ తీసుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా 14 నుంచి 18 వారాల పాటు రక్తపరీక్షల కోసం శాంపిల్స్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ముందుగానే అవన్నీ చెప్పారు.


డబ్బు కోసం కాదు!

ట్రయల్స్‌లో పాల్గొనందుకు వాళ్లు డబ్బు ఆఫర్‌ చేస్తున్నారు. కానీ నేను డబ్బు కోసమే ఇది చేయడం లేదు. కొన్ని వేలమంది అప్లికేషన్స్‌ పెట్టుకుంటే అందులో నాకు అవకాశం వచ్చింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌పై పోరాటానికి నా వంతు సహాయం చేస్తున్నట్టుగా భావిస్తున్నా. నా తల్లితండ్రులు కెన్‌మోర్‌లో ఉంటారు. వృద్ధాప్యంలో ఉన్న వాళ్లను చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. వ్యాక్సిన్‌ వల్ల నాకు ఏమీ కాదన్న ధైర్యం ఉంది.


కరోనా మూలంగా ఎంతో మంది ఉద్యోగాలు పోతున్నాయి. ముఖ్యంగా రెస్టారెంట్‌ రంగంపై ప్రభావం ఎక్కువగా ఉంది. దీని ప్రభావం శారీరకంగానే కాకుండా, మానసికంగా కూడా ఉంటోంది. చాలామందికి ట్రయల్స్‌ అంటే అవగాహన ఉండదు. కరోనా వైరస్‌ ముందుగా ఎక్కిస్తారని అనుకుంటారు. కానీ అలా ఉండదు. మొత్తం ట్రయల్స్‌లో కరోనా వైరస్‌ ఎఫెక్ట్‌ మాపై ఉండదని చెప్పారు. ఏమైనా కరోనా వ్యాక్సిన్‌ ట్రయల్స్‌లో పాల్గొనడం గర్వంగా ఉంది. ఈ పరిస్థితుల్లో నా కుటుంబసభ్యులు, స్నేహితుల సహకారం మరువలేను.’’

Updated Date - 2020-03-20T03:43:24+05:30 IST