ఆగస్ట్ 1 తర్వాత దుబాయ్ వెళ్తున్నారా.. అయితే ఈ వార్త మీకోసమే!

ABN , First Publish Date - 2020-07-27T16:56:23+05:30 IST

కరోనా నేపథ్యంలో దుబాయ్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా తీవ్రత అత్యధికంగా ఉన్న దేశాల నుంచి దుబాయికి వచ్చే ప్రయాణికులు దుబయ్‌లోని విమానాశ్రయం

ఆగస్ట్ 1 తర్వాత దుబాయ్ వెళ్తున్నారా.. అయితే ఈ వార్త మీకోసమే!

అబుధాబి: కరోనా నేపథ్యంలో దుబాయ్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా తీవ్రత అత్యధికంగా ఉన్న దేశాల నుంచి దుబాయికి వచ్చే ప్రయాణికులు దుబయ్‌లోని విమానాశ్రయంలో తప్పనిసరిగా పీసీఆర్ కొవిడ్ టెస్ట్ చేయించుకోవాలని ప్రకటించింది. ఈ ఆదేశాలు ఆగస్ట్ 1 నుంచి అమలులోకి రానున్నట్లు వెల్లడించింది. వివరాల్లోకి వెళ్తే.. వివిధ దేశాల నుంచి యూఏఈకి వెళ్లే ప్రయాణికులకు కొవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి చేస్తూ ఆ దేశ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రయాణానికి 96 గంటల ముందు.. గుర్తింపు పొందిన ల్యాబ్‌లలో నెగెటివ్ సర్టిఫికెట్ పొందిన వారినే తమ దేశంలోకి అనుమతించనున్నట్లు యూఏఈ తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా కరోనా తీవ్రత అత్యధికంగా ఉన్న 29దేశాల జాబితాను దుబాయి రూపొందించింది. ఆయా దేశాల నుంచి దుబాయికి వచ్చే ప్రయాణికుల వద్ద నెగెటివ్ సర్టిఫికెట్ ఉన్నప్పటికీ.. విమానాశ్రయంలో మరోసారి కొవిడ్ పరీక్షలను దుబాయ్ తప్పనిసరి చేసింది. అంతేకాకుండా పరీక్షా ఫలితాలు తెలిసే వరకు సదరు దేశాల ప్రయాణికులు స్వీయ నిర్భంధంలో ఉండాలని తెలిపింది. ఈ పరీక్షలో ఎవరికైనా పాజిటివ్ వస్తే.. వారు దుబాయ్ హెల్త్ అథారిటీ నిబంధనలను పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కాగా.. దుబాయ్ రూపొందించిన 29 దేశాల జాబితాలో అమెరికా, బ్రెజిల్.. తదితర దేశాలతోపాటు భారతదేశం కూడా ఉంది. 


Updated Date - 2020-07-27T16:56:23+05:30 IST