కోరలు చాస్తున్న కరోనా.. ‘ఎమర్జెన్సీ’లో ప్రపంచం!
ABN , First Publish Date - 2020-03-24T12:54:29+05:30 IST
కోరలు చాస్తూ కమ్ముకొస్తున్న కరోనా మహమ్మారికి దేశాలన్నీ వణికిపోతున్నాయి. ముప్పు తీవ్రం కాకుండా జర్మనీ, గ్రీస్, స్పెయిన్, ఫ్రాన్స్.. ఇలా ఒకదానివెంట ఒకటి ఆంక్షలు విధిస్తున్నాయి. న్యూజిలాండ్ 4 వారాల షట్‌డౌన్ నిర్ణయం తీసుకుంది. విదేశీయులను రానివ్వమని హాంకాంగ్ తెలిపింది.

తీవ్ర ఆంక్షలతో పలు దేశాల్లో లాక్‌డౌన్‌లు
16 వేలు దాటిన కరోనా మరణాలు
వాషింగ్టన్, న్యూయార్క్, రోమ్, మార్చి 23: కోరలు చాస్తూ కమ్ముకొస్తున్న కరోనా మహమ్మారికి దేశాలన్నీ వణికిపోతున్నాయి. ముప్పు తీవ్రం కాకుండా జర్మనీ, గ్రీస్, స్పెయిన్, ఫ్రాన్స్.. ఇలా ఒకదానివెంట ఒకటి ఆంక్షలు విధిస్తున్నాయి. న్యూజిలాండ్ 4 వారాల షట్‌డౌన్ నిర్ణయం తీసుకుంది. విదేశీయులను రానివ్వమని హాంకాంగ్ తెలిపింది. జార్జియాలో ఈ వారం ఎమర్జెన్సీ కొనసాగనుంది. ఇటలీలో సాధారణ ప్రయాణాల రద్దు, పరిశ్రమల మూసివేతకు ఆదేశాలిచ్చారు. బంగ్లాదేశ్‌లో ఈ నెల 26 నుంచి సెలవులిచ్చారు. శ్రీలంకలో కర్ఫ్యూ పొడిగించారు. మధ్య ప్రాచ్యంలో ఆంక్షలు కఠినం చేశారు. సౌదీలో 21 రోజుల పాటు రాత్రి కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. ఉల్లంఘిస్తే రూ.లక్షన్నర జరిమానా కఠిన శిక్షలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరించింది. దుబాయ్ విమానాశ్రయాన్ని రెండు వారాలు మూసివేయనున్నారు. అర్జెంటీనా లాక్‌డౌన్ ప్రకటించింది.
స్పెయిన్‌లో విలయతాండవం
ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాలు 15,189కి చేరాయి. స్పెయిన్‌లో ఒక్క రోజే 462 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో మరో 471 మంది మృతి చెందారు. రిపబ్లికన్ సెనేటర్ రాండ్ పాల్ వైర్‌సకు గురయ్యారు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌కూ కరోనా ప్రబలింది. జర్మనీ చాన్స్‌లర్ మెర్కెల్ క్వారంటైన్‌కు వెళ్లారు. ఇరాన్‌లో కొత్తగా 127 మంది మృతిచెందారు. రోగులకు చికిత్స చేస్తూ పీవోకేలోని గిల్గిట్- బాల్టిస్తాన్‌కు చెందిన వైద్యుడు (26) కరోనాతో చనిపోయాడు. కేసులు 800 దాటడంతో పాక్ సైన్యాన్ని దించింది. దుబాయ్, కౌలాలంపూర్ విమానాశ్రయాల్లో పలువురు భారతీయులు చిక్కుకుపోయారు. కేసుల పెరుగుదల తీరు ను విశ్లేషిస్తూ కరోనా విస్తృతం అవుతోందని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. వైరస్‌పై తక్షణమే యుద్ధానికి దేశాలకు పిలుపునిచ్చింది.
ఇరాన్.. చేజేతులా
న్యూఢిల్లీ, మార్చి 23: రోజురోజుకూ పెరిగిపోతున్న కరోనా మరణాలతో ఇరాన్ మరుభూమిని తలపిస్తోంది. ఆసియాలో ప్రతి పది కరోనా మరణాల్లో తొమ్మిది ఇక్కడే నమోదవుతున్నాయి. ఇప్పటివరకు 1,812 మరణాలతో చైనా తర్వాత ఆసియాలోనే అత్యధిక మరణాలు సంభవించిన దేశంగా నిలిచింది. ఫిబ్రవరి 19న తొలి కరోనా కేసు నమోదైనా.. ప్రభుత్వం దాచిపెట్టింది. అదెంతటి తప్పిదమో ఇప్పుడు తెలిసొస్తోంది. కరోనా ఇరాన్‌ను ఏమీ చేయలేదని, ప్రజలను నిర్బంధంలో ఉంచడం రాతియుగపు చర్యని దేశ ఆరోగ్యమంత్రి చేసిన ప్రకటన వారి నిర్లక్ష్యానికి పరాకాష్ట. తర్వాత ఆయన సైతం కరోనాతో క్వారంటైన్ అయ్యారు. నష్టమంతా జరిగాక ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది.
న్యూయార్క్‌లో 2 గంటలకు ఒక కేసు
(న్యూయార్క్ నుంచి కిలారు అశ్వినీ కృష్ణ)
ప్రపంచంలోనే ప్రముఖ ఆర్థిక, వాణిజ్య నగరంగా పేరుగాంచిన న్యూయార్క్‌ను కరోనా కబళిస్తోంది. ఇక్కడి ‘‘టైమ్స్ స్క్వేర్.. శ్మశాన ప్రాంతాన్ని తలపిస్తోంది. ప్రతి రెండు గంటలకు ఒక కరోనా కేసు నమోదుతో ఈ నగరాన్ని అత్యంత కల్లోల ప్రదేశంగా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. సహాయక చర్యలకు ఆర్మీని రంగంలోకి దింపారు. హోటళ్లను మూసివేసి వాటిలోని 10 వేల గదుల్లో కరోనా బాధితులకు చికిత్సకు ఏర్పాట్లు చేస్తున్నారు. వైద్యం అందించడానికి అవకాశం ఉన్న కాలేజీలు, క్రీడా మైదానాలను సైన్యం గుర్తిస్తోంది. మెట్రో, ట్యూబ్ రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. లక్షలాది తెలుగు కుటుంబాలుండే న్యూజెర్సీ, కనెక్టికట్ తదితర ప్రాంతాల్లో కరోనా కేసులు లేకపోవడం కొంత ఊరట. తెలుగువారి కోసం తానా, నాట్స్, ఆటా హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేశాయి.
పెద్దలకు రక్షణ ఇలా!
కరోనా వైరస్ సోకినవారిలో.. మృత్యువాత పడుతున్నవారి సంఖ్య 3 శాతంలోపే! అది ఊరట కలిగించే విషయమేగానీ.. చనిపోతున్నవారిలో అత్యధికులు వృద్ధులే!! ఇది ఆందోళన కలిగించే విషయం. చైనాలో కరోనా సోకిన 72 వేల మందిపై చేసిన అధ్యయనం ప్రకారం.. మృతుల రేటు కేవలం 2.3ు. కానీ, వైరస్ బారినపడిన 80ఏళ్లు దాటిన వృద్ధుల్లో 15ు మంది ప్రాణాలు కోల్పోయారు. అటు అమెరికాలోనూ నమోదవుతున్న ప్రతి 10 మరణాల్లో.. 8 మరణాలు 65 ఏళ్లు దాటిన వృద్ధులవే. ఎందుకంటే.. వయసు పెరిగే కొద్దీ రోగనిరోధక వ్యవస్థ శక్తిసామర్థ్యాలు తగ్గుతుంటాయి. ఇంట్లో ఉన్న పెద్దలను (60 ఏళ్లు దాటినవారు), అలాగే పిల్లలను (పదేళ్లలోపు) ఎలా కాపాడుకోవాలి? అనే ప్రశ్నలకు సీడీసీ (సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) వైద్యనిపుణులు చేస్తున్న సూచనలివి...
60 ఏళ్లు దాటిన వృద్ధులను ఇంట్లోనే ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ బయటకు వెళ్లినా.. ఇంటికి రాగానే చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి.
వృద్ధులను రెగ్యులర్ చెక్‌పలు, వైద్యపరీక్షలు చేయించుకోకపోయినా పర్వాలేదు. ఎక్కువగా జనం ఉండే ఆస్పత్రుల వద్ద వైరస్ వ్యాపించే ముప్పు అధికం.
బయటకు వెళ్లి ఇంటికి వచ్చే తమ పిల్లలను, బయట ఆడుకొని వచ్చే మనవలను వీలైనంతవరకూ తాకకుండా దూరంగా ఉండడానికి వృద్ధులు ప్రయత్నించాలి.
జలుబు, దగ్గు వంటివాటితో బాధపడేవారికి కనీసం 6 అడుగుల దూరంలో ఉండాలి.
ఇంట్లో అందరూ తరచుగా తాకే ప్రదేశాలను శానిటైజర్లు, డిస్‌ఇన్ఫెక్టెంట్లతో శుభ్రం చేస్తుండాలి.
ధ్యానం చేయడం, దీర్ఘ శ్వాస తీసుకోవడాన్ని సాధన చేయడం, పౌష్టికాహారం తీసుకోవడం, ఉన్నచోటే కూర్చోకుండా తేలికపాటి ఎక్సర్‌సైజులు చేయడం, తగినంత నిద్ర పోవడం.. మరింత ఆరోగ్యంగా ఉంచుతాయి. -సెంట్రల్ డెస్క్
వివిధ దేశాల్లో కరోనా మరణాలు
దేశం మృతులు
అమెరికా 484
ఇరాన్ 1,812
స్పెయిన్ 2,207
ఇటలీ 6077
ఫ్రాన్స్ 674
చైనా 3,270