యూఎస్‌లో 'కరోనా' కరాళ నృత్యం.. నలుగురు భారతీయులు బలి.. 10వేలు దాటిన మృతులు
ABN , First Publish Date - 2020-04-07T13:04:39+05:30 IST
పంచ వ్యాప్తంగా 70 వేల మందిని కరోనా బలితీసుకొంది. యూర్‌పలో అత్యధికంగా 50,125 మంది మృత్యువాతపడ్డారు. 15,877 మరణాలతో ఇటలీ, 13,055 మరణాలతో స్పెయిన్, 8,078 మరణాలతో ఫ్రాన్స్ విషాదంలో కూరుకుపోయాయి.

ప్రపంచాన్ని కబళిస్తున్న కరోనా
70వేలకు చేరిన ప్రపంచ మృతులు
బ్రిటన్ ప్రధాని ఆరోగ్యం విషమం
అమెరికాలో పదివేలు దాటిన మృతులు
పారిస్, వాషింగ్టన్: ప్రపంచ వ్యాప్తంగా 70 వేల మందిని కరోనా బలితీసుకొంది. యూర్‌పలో అత్యధికంగా 50,125 మంది మృత్యువాతపడ్డారు. 15,877 మరణాలతో ఇటలీ, 13,055 మరణాలతో స్పెయిన్, 8,078 మరణాలతో ఫ్రాన్స్ విషాదంలో కూరుకుపోయాయి. యూర్‌పలో ఒక్కరోజే 1100 మంది చనిపోయారు. పాజిటివ్‌తో ఆస్పత్రిలో చేరిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పరిస్థితి మెరుగుపడుతోందని వైద్యులు తెలిపారు. ఇంగ్లండ్ రాణి ఎలిజబెత్ వీడియో లింకు ద్వారా కామన్‌వెల్త్ దేశాలను అప్రమత్తం చేశారు. పలు సూచనలు చేశారు.
కాగా, ఇక్కడ సోమవారం 439 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో మరణాలు 5,373 మందికి చేరాయి. స్పెయిన్, ఇటలీలో 24 గంటల్లో వరుసగా 637, 636 మంది చనిపోయారు. ఒకదశలో ఒక్కరోజే 950 మరణాలను చూసిన స్పెయిన్‌లో గత రెండు వారాల్లో తొలిసారిగా సోమవారమే తక్కువ మరణాలు నమోదయ్యాయి. లక్ష పాజిటివ్ కేసుల జాబితాలో జర్మనీ చేరిపోయింది. ఇప్పటికి 1500 మంది చనిపోయారు. తమదేశంలో పనిచేస్తున్న దాదాపు 20 వేల మంది విదేశీయులను సింగపూర్ ప్రభుత్వంలో క్వారంటైన్ చేసింది.
పాకిస్థాన్‌లో ఇప్పటికి 3,277 పాజిటివ్ కేసులు బయటపడగా, 1500 కేసులు ఒక్క పంజాబ్ ప్రావిన్సీలోనే నమోదయ్యాయి. చైనాలో రెండోవిడత కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికి 38 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. కరోనా వైరస్ ఔషధం విషయంలో ఫ్రాన్స్ కూడా అమెరికా బాటపట్టాలని అక్కడి ప్రజలు ఉద్యమిస్తున్నారు. తమకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఔషధం ఇచ్చేలా వైద్యులకు ఉత్తర్వులు ఇవ్వాలంటూ ఏకంగా 2.15 లక్షల మంది తమ సంతకాలతో అక్కడి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సరిహద్దులు మూసుకుపోయి.. ఎక్కడికక్కడ కంచెలు మొలుస్తున్న కాలంలో సిగరేట్లు అమ్మడానికి ఫ్రాన్స్ నుంచి స్పెయిన్‌కు బయలుదేరిన ఓ వ్యాపారిని సరిహద్దుల్లో రక్షించి ఫ్రాన్స్ అధికారులు జరిమానా విధించారు.
అమెరికాలో మృత్యుఘోష
అమెరికాలోని ప్రతి నాలుగు ఆస్పత్రుల్లో మూడు కరోనా బాధితులతో నిండిపోయాయి. వీటి ల్లో పరీక్షలు చేసే సామర్థ్యం నామమాత్రంగా ఉండటమే కాదు, పాజిటివా, నెగిటివా అనేది తేలి తత్సంబంధమైన చికిత్సను ప్రారంభించడానికి కావాల్సిన ల్యాబ్‌ల నివేదికల విడుదలా జాప్యం అవుతుందట! న్యూయార్క్‌లోని ఆస్పత్రుల సిబ్బంది, కార్యకర్తలు.. వైద్య పరికరాల కొరత, అరకొర రక్షణ సామగ్రితో తాము మహమ్మారితో యుద్ధం చేస్తున్నామని పేర్కొనడం గమనార్హం! ‘ఇప్పటిదాకా మనం అనుభవించింది ఒక ఎత్తు. దుర్భరమైన రోజులను వచ్చే వారంలో గడపనున్నాం’ అని అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు.
మరణాలు ఈ వారంలోనే పదివేలకు చేరొచ్చునని సర్జన్ జనరల్ వైస్ అడ్మిరల్ జెరోమ్ ఆడమ్స్ చెప్పారు. హృదయ సంబంధ వ్యాధుల నిపుణుడు డాక్టర్ జగ్‌సింగ్ న్యుమోనియాతో బాధపడుతుండగా కరోనా లక్షణాలు కనిపించాయి. మసాచుసెట్స్ జనరల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో వైద్యులకు ఆయన పూర్తిగా సహకరించడంతోపాటు ప్రయోగాత్మక దశలో ఉన్న కరోనా నియంత్రణ ఔషధం రెమిడీసివీర్‌ను తనపై పరీక్షించడానికీ సంతోషంగా అంగీకరించారు. అమెరికాలో ప్రజలు ఇప్పుడు జాగ్రత్తల బాటపట్టారు. భౌతికదూరం పాటించడంతోపాటు కరచాలనాలకు గుడ్‌బై చెప్పారు. గుంపులకు, గ్రూపులకు కూడా దూరం పాటిస్తున్నారు. తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాల్లో తమ జీవనోపాధిపై ఆవేదన చెందుతున్నారు.