అగ్రరాజ్యంలో 50వేలు దాటిన కరోనా మరణాలు!

ABN , First Publish Date - 2020-04-24T19:20:25+05:30 IST

కరోనా వైరస్ ప్రపంచ దేశాలపై తన ప్రతాపాన్ని కొనసాగిస్తూనే. అగ్రరాజ్యాలపై కూడా దీని ప్రభావం తీవ్రంగా ఉంది. ముఖ్యంగా అమెరికా.. కరోనా దెబ్బకు అ

అగ్రరాజ్యంలో 50వేలు దాటిన కరోనా మరణాలు!

వాషింగ్టన్: కరోనా వైరస్ ప్రపంచ దేశాలపై తన ప్రతాపాన్ని కొనసాగిస్తూనే. అగ్రరాజ్యాలపై కూడా దీని ప్రభావం తీవ్రంగా ఉంది. ముఖ్యంగా అమెరికా.. కరోనా దెబ్బకు అతలాకుతలం అవుతోంది. అగ్రరాజ్యంలో కరోనా మరణాల సంఖ్య 50వేలు దాటింది. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించిన సమాచారం ప్రకారం.. 24 గంటల్లో అమెరికాలో 3,176 కరోనా మరణాలు సంభవించాయి. దీంతో అమెరికాలో కరోనా కాటుకు బలైన వారి సంఖ్య 50,243కు చేరింది. కాగా.. వరల్డ్ఒమీటర్‌లోని సమాచారం ప్రకారం అమెరికాలో 8.86లక్షల మంది కరోనా బారినపడ్డారు. అమెరికాలోని న్యూయార్క్, న్యూజెర్సీ, మస్సాచుస్సెట్స్‌ రాష్ట్రాల్లో మహమ్మారి తీవ్రత అధికంగా ఉంది. ఇప్పటి వరకు న్యూయార్క్‌లో 2.68లక్షల మంది కరోనా బారినపడగా.. 20,861 మంది మరణించారు. న్యూజెర్సీలో కరోనా బాధితుల సంఖ్య లక్ష దాటింది. 5,428 మంది ప్రాణాలు కోల్పోయారు. మస్సాచుస్సెట్స్‌లో 46వేల మందికి కరోనా సోకగా.. 2,360 మంది మృతి చెందారు. 


ఇదిలా ఉంటే.. కరోనా కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే పని‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా అమెరికాలో లాక్‌డౌన్‌ను ఎత్తేసేందుకు  సిద్ధపడుతున్నారు. మూడు దశల్లో లాక్‌డౌన్‌ను ఎత్తేసేందుకు ఇప్పటికే మార్గదర్శకాలు కూడా విడుదల చేశారు. అమెరికా పౌరులు కూడా లాక్‌డౌన్ ఎత్తేయడాన్నే కోరుకుంటున్నారు. కాగా.. అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తున్న వేళ ట్రంప్ సర్కార్ లాక్‌డౌన్‌ను ఎత్తేసేందుకు ప్రయత్నిస్తుండటంపై కొందరు వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ను ఎత్తేస్తే.. కరోనా ముప్పు మరింత పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. కాగా.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 2లక్షలకు చేరువలో ఉంది. దాదాపు 27.32లక్షల మంది కరోనా బారినపడ్డారు. 


Updated Date - 2020-04-24T19:20:25+05:30 IST