విశ్వరూపం దాల్చిన కరోనా.. నిర్బంధంలో ప్రపంచం!

ABN , First Publish Date - 2020-03-16T11:11:16+05:30 IST

విశ్వరూపం దాల్చిన కరోనా వైర్‌సను అడ్డుకొనేందుకు వివిధ దేశాలు నిషేధాజ్ఞలు విధిస్తున్నాయి. ప్రజలను ఇళ్లు దాటి బయటకు రానీయకపోవడం నుంచి

విశ్వరూపం దాల్చిన కరోనా.. నిర్బంధంలో ప్రపంచం!

  • ఒక్క రోజే 500 మందికి పైగా మృతి
  • 6,000 దాటిన కరోనా మృతుల సంఖ్య
  • బ్రిటన్‌పైనా అమెరికా ప్రయాణ నిషేధం
  • న్యూజెర్సీలో కర్ఫ్యూ.. మనీలా మూసివేత
  • ఇల్లు కదలొద్దు.. స్పెయిన్‌లో నిషేధాజ్ఞలు
  • ఫ్రాన్స్‌లో సూళ్లు, హోటళ్లు, థియేటర్లు బంద్‌
  • దూరం ప్రయాణించే రైళ్లు, బస్సుల నిలిపివేత
  • ఇటలీలో క్రీడా మైదానాలకు తాళం

వాషింగ్టన్‌, మార్చి 15: విశ్వరూపం దాల్చిన కరోనా వైర్‌సను అడ్డుకొనేందుకు వివిధ దేశాలు నిషేధాజ్ఞలు విధిస్తున్నాయి. ప్రజలను ఇళ్లు దాటి బయటకు రానీయకపోవడం నుంచి కర్ఫ్యూ అమలు, నగరాలు, సరిహద్దుల మూసివేత వరకు రకరకాల చర్యలు చేపట్టాయి. కరోనా కాటుకు ప్రపంచవ్యాప్తంగా 24 గంటల్లో 500 మందిపైగా బలయ్యారు. దీంతో మృతుల సంఖ్య 6 వేలు దాటింది. పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,59,844కు పెరిగింది. అమెరికా... ప్రయాణ నిషేధాన్ని బ్రిటన్‌, ఐర్లాండ్‌కూ వర్తింపజేసింది. అమెరికాలో న్యూజెర్సీ సహా పలు నగరాల్లో ప్రజలు గుమిగూడడాన్ని నిషేధించారు.  ఫిలిప్సైన్స్‌ రాజధాని మనీలాను మూసివేశారు. ఎవరూ రాకుండా, బయటకు వెళ్లకుండా పోలీసులు, సైనికులు పహరా కాస్తున్నారు.


ఫ్రాన్స్‌లో స్కూళ్లు, హోటళ్లు, థియేటర్లను మూసివేశారు. ఎక్కువ దూరం ప్రయాణించే రైళ్లు, బస్సులను నిలిపివేశారు. ఇటలీలో రోమ్‌, మిలాన్‌ సహా పలు నగరాల్లో క్రీడా మైదానాలు మూసివేశారు. యూరప్‌ దేశాలు పొరుగుకు ‘నో ఎంట్రీ’ అంటున్నాయి. డెన్మార్మ్‌ సరిహద్దులు మూసివేసింది. పోలాండ్‌, చెక్‌ రిపబ్లిక్‌, స్లొవేకియా ఇదే బాట పట్టనున్నాయి. నార్వే, పోలాండ్‌తో సరిహద్దులు మూసివేస్తున్నట్లు రష్యా ప్రకటించింది. ఇతర దేశాల నుంచి చైనాకు వచ్చేవారిని వైద్య పరీక్షలకు అనువుగా మార్చిన ఎగ్జిబిషన్‌ కేంద్రానికి తరలిస్తున్నారు. ఆ దేశంలో మరో 10 మంది మృతిచెందారు. దీంతో మరణాల సంఖ్య 3,199కు పెరిగింది. దేశంలోకి వచ్చే వారు స్వచ్ఛందంగా 14 రోజులు ఐసోలేషన్‌లో ఉండాలని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ ఆంక్షలు విధించాయి. కజకిస్థాన్‌, సాల్వెడార్‌లు అత్యవసర పరిస్థితి ప్రకటించాయి. పాకిస్థాన్‌లో కొత్తగా 20 కేసులు నమోదయ్యాయి. 


ఇటలీలో ఒక్కరోజే 368 మంది బలి

యూరప్‌లో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న ఇటలీలో ఒక్కరోజే  368 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1400 దాటింది. 24 గంటల్లో కొత్తగా 3,497 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇది సుమారు 20 శాతం. మొత్తం కేసులు 21,000 దాటాయి.  


ఇరాన్‌లో మరో 113 మంది మృతి

ఇరాన్‌లో ఆదివారం కరోనా 113 మందిని బలి తీసుకుంది. దీంతో మృతుల సంఖ్య 724కు చేరింది. కొత్తగా 1,209 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసులు 13,938కి పెరిగాయి. ప్రజలు బయటకు రావద్దని ప్రభుత్వం ఆదేశించింది. 


స్పెయిన్‌లో కొత్తగా 2,000 కేసులు

స్పెయిన్‌లో 24 గంటల్లో 105 మంది మృతి చెందారు. దీంతో మరణాల సంఖ్య 250 దాటింది. ఆదివారం కొత్తగా 2 వేల కేసుల నమోదుతో మొత్తం సంఖ్య 7.753 దాటింది. ఇందులో ఎక్కువ రాజధాని మాడ్రిడ్‌లోనే నమోదయ్యాయి. ప్రధాని పెడ్రో సాంచెజ్‌ భార్య బెగొనా గోమెజ్‌కు కరోనా సోకింది.


ట్రంప్‌కు కరోనా సోకలేదు : వైట్‌హౌస్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు కరోనా వైరస్‌ సోకలేదని నిర్ధారణ అయింది. ‘‘శుక్రవారం రాత్రి ట్రంప్‌తో విస్తృతంగా చర్చించిన తర్వాత ఆయన కొవిడ్‌-19 పరీక్షకు అంగీకరించారు. ఫలితం ‘నెగెటివ్‌’ వచ్చింద’’ని అధ్యక్షుడి ఫిజీషియన్‌ డాక్టర్‌ సీన్‌ కోన్లే తెలిపారు. ట్రంప్‌ ఇటీవల తన ఫ్లోరిడా రిసార్ట్‌లో బ్రెజిల్‌ ప్రతినిధి బృందంతో భేటీ అయ్యారు. ఆ బృందంలోని బ్రెజిల్‌ అధ్యక్షుడు బోల్సోనారో సలహాదారు ఫాబియోతో పాటు కొందరికి వైరస్‌ సోకింది. ఐసోలేషన్‌కు ట్రంప్‌ విముఖత చూపారు. కరోనా లక్షణాలు లేవంటూ పరీక్షకూ నిరాకరించారు. అయితే శ్వేతసౌధంలో తాజా సమావేశంలో చర్చ అనంతరం ఒప్పుకున్నారు. 24 గంటల్లోపే పరీక్ష ఫలితం వచ్చింది.

Updated Date - 2020-03-16T11:11:16+05:30 IST