చైనాలో మళ్లీ కరోనా కలకలం..!

ABN , First Publish Date - 2020-06-22T13:51:11+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట పడడం లేదు. జాన్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ లెక్కల ప్రకారం ఇప్పటివరకు 85 లక్షల మందికిపైగా సోకిన వైరస్‌.. 4.5 లక్షల మంది ప్రాణాలను హరించింది. విశ్వవ్యాప్తంగా రోజూ 1.5 లక్షలపైనే కేసులు వె

చైనాలో మళ్లీ కరోనా కలకలం..!

బీజింగ్‌, జూన్‌ 21: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట పడడం లేదు. జాన్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ లెక్కల ప్రకారం ఇప్పటివరకు 85 లక్షల మందికిపైగా సోకిన వైరస్‌.. 4.5 లక్షల మంది ప్రాణాలను హరించింది. విశ్వవ్యాప్తంగా రోజూ 1.5 లక్షలపైనే కేసులు వెలుగు చూస్తున్నాయి. వైరస్‌ పుట్టినిల్లు చైనాలో కరోనా మళ్లీ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. ఆదివారం ఇక్కడ 25 కేసులు నమోదైతే.. రాజధాని బీజింగ్‌లోనే 22 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో చైనా ప్రభుత్వం బీజింగ్‌లో టెస్టుల వేగాన్ని పెంచింది. రోజూ 10 లక్షల పరీక్షలు చేసేదిశగా చర్యలు చేపట్టింది. ఇక దక్షిణ కొరియాలో కూడా 48 కొత్త కేసులు బయటపడ్డాయి.దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 12,421కి చేరుకుంది. 


పరీక్షలు తగ్గించండి: ట్రంప్‌ 

అమెరికాలో వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. 24 గంటల్లో ఇక్కడ 33,388 మందికి  వైరస్‌ సోకింది. వైర్‌సతో 573 మంది చనిపోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 23,30,578కి చేరగా.. మృతుల సంఖ్య 1,21,980కి పెరిగింది.  దేశంలో కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఎక్కువ పరీక్షలు చేస్తే ఎక్కువ కేసులు వెలుగులోకి వస్తాయి. అందుకే పరీక్షలు తగ్గించమని అధికారులకు చెప్పా’ అని ఎన్నికల ర్యాలీ సందర్భంగా చెప్పారు. అమెరికా హాస్యనటుడు డీఎల్‌ హగ్లీకి కరోనా పాజిటివ్‌గా తేలింది. కాగా.. బ్రిటన్‌, ఫ్రాన్స్‌లో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో లాక్‌డౌన్‌ నిబంధనలు సడలిస్తున్నారు. బ్రెజిల్‌లో కొత్తగా 31 వేలు, దక్షిణాఫ్రికాలో 4966, పాకిస్థాన్‌లో 4,951, సింగపూర్‌లో 262, బంగ్లాదేశ్‌లో 3531 కేసులు నమోదయ్యాయి. కాగా తమ దేశంలో భారత్‌ నుంచి వచ్చిన వలస కార్మికుల వల్లే కేసులు అధికంగా నమోదవుతున్నాయని నేపాల్‌ ప్రభుత్వం పేర్కొంది. 


Updated Date - 2020-06-22T13:51:11+05:30 IST